మెదడులోని ఆలోచనలూ చదివేస్తుంది.. కొత్త AIని ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు!

మనిషి ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చే సరికొత్త సాంకేతికతను శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. త్వరలోనే ఈ సాంకేతితకతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామని వారు తెలిపారు. మరోవైపు సాంకేతికత దుర్వినియోగంపై కూడా పరిశోధన బృందం ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 04 May 2023 01:40 IST

ఆస్టిన్‌: మనిషి మనసులో ఏమనుకుంటున్నాడో అంచనా వేయడం చాలా కష్టం. మెదడులోని ఆలోచనలను సైతం చదివే సాంకేతికతపై ఎంతో కాలంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు చాట్‌జీపీటీ (ChatGPT) రాకతో కృత్రిమ మేధ (AI)కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో మైక్రోసాఫ్ట్‌ (Microsoft), గూగుల్ (Google), మెటా (Meta) వంటి సంస్థలు దీని అభివృద్ధిపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో కృత్రిమ మేధ సాయంతో మనిషి మెదడులోని ఆలోచనల గురించి తెలుసుకోగలిగే సరికొత్త సాంకేతికతను శాస్త్రవేత్తలు (Scientists) ఆవిష్కరించారు.

యూనివర్శిటీ ఆఫ్‌ టెక్సాస్‌ (University of Texas)కు చెందిన పరిశోధన బృందం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇది మనిషి ఆలోచనలకు అక్షర రూపం ఇస్తుందని తెలిపారు. యూనివర్శిటీలో న్యూరోసైన్స్ (Neuroscience) అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (Computer Science) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అలెక్స్‌ హూత్‌, కంప్యూటర్‌ సైన్స్ పరిశోధన విద్యార్థి జెర్రీ ట్యాంగ్ ఈ పరిశోధనను చేపట్టారు. ఏఐ రంగంలో ఇదో గొప్ప ముందడుగని వారు వెల్లడించారు. దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని నేచర్‌ న్యూరోసైన్స్‌ (Nature Neuroscience) అనే జర్నల్‌లో ప్రచురించినట్లు తెలిపారు. 

పరిశోధన సాగిందిలా..

పరిశోధన బృందం ముందుగా ముగ్గురు వ్యక్తులపై ఈ సాంకేతికతను పరీక్షించినట్లు తెలిపింది. ఇందులో భాగంగా ముగ్గురు వ్యక్తులకు 16 గంటలపాటు కొన్ని కథలను వినిపించారు. ఆ సమయంలో ఫంక్షనల్‌ మాగ్నటిక్‌ రెజోనెన్స్ ఇమేజింగ్ (fMRI)ను ఉపయోగించి కొన్ని పదాలకు వారి నాడులు స్పందిస్తున్న తీరును గుర్తించారు. అలానే ఆ స్పందనలను అక్షర రూపంలోకి మార్చేందుకు వారు రూపొందించిన చాట్‌జీపీటీ తరహా జీపీటీ ఏఐ (GPT AI)ని ఉపయోగించారు. ఈ క్రమంలో కథలు వింటున్న వ్యక్తుల ఆలోచనలకు జీపీటీ ఏఐ అక్షరాల రూపంలోకి మార్చిందని తెలిపారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను జీపీటీ ఏఐ ఫలితాల గురించి ప్రశ్నించగా 82 శాతం సరిపోలాయని పరిశోధకులు తెలిపారు. 

ఈ సాంకేతికత తమలోని భావాలను వ్యక్తపరచలేని వ్యక్తులకు ఎంతో ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను మరింత మెరుగుపరిచే పనిలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం మానసిన ప్రశాంతత కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని అన్నారు. మరోవైపు ఈ సాంకేతికత దుర్వినియోగంపై కూడా పరిశోధన బృందం ఆందోళ వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు లేదా ప్రైవేటు సంస్థలు ఉద్యోగులపై నిఘా కోసం దీన్ని ఉపయోగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మానసిక గోప్యతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని