Recession: అక్కడి మాంద్యం మనకు అవకాశం: సీతారామన్‌

పాశ్చాత్య దేశాల్లో మాంద్యం భయాలు అలముకొన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి భారత్‌కు ఇదొక గొప్ప అవకాశమన్నారు.

Published : 16 Dec 2022 19:57 IST

దిల్లీ: పాశ్చాత్య దేశాలలో నెలకొన్న మాంద్యం (recession) భయాలను భారత్‌ అవకాశాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలను రచించాలని దేశీయ పరిశ్రమ వర్గాలను కోరారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కావాల్సిన నిబంధనల్ని సైతం ప్రభుత్వం మారుస్తోందన్నారు. తద్వారా మన దేశానికి రావాలనుకుంటున్న పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తోందని శుక్రవారం దిల్లీలో జరిగిన ఓ సమావేశంలో అన్నారు.

‘‘పాశ్చాత్య దేశాల్లో రాబోతున్న ఆర్థిక మాంద్యానికి (recession) సన్నద్ధమవుతున్న తరహాలోనే.. అక్కడి తయారీ సంస్థల్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు కూడా వ్యూహాల్ని రూపొందించాలి. ఆయా కంపెనీలకు అక్కడ ప్రధాన కేంద్రాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ తయారీ చేపట్టడం వారికి లాభదాయకంగా ఉండొచ్చు. ఐరోపాను తీవ్రంగా ప్రభావితం చేయనున్న ఈ మాంద్యం (recession) కేవలం భారత ఎగుమతుల్ని దెబ్బతీయడమే కాదు.. అవకాశాలనూ తీసుకొస్తుంది. ముఖ్యంగా కొత్త ప్రదేశాలకు విస్తరించాలనుకుంటున్న కంపెనీలను ఆకర్షించడానికి ఇది మనకు గొప్ప అవకాశం’’ అని సీతారామన్‌ (Nirmala Sitharaman) అన్నారు.

తయారీని నిర్లక్ష్యం చేయొద్దని భారత పరిశ్రమలకు సీతారామన్‌ (Nirmala Sitharaman) సూచించారు. చైనా తరహాలో భారత్‌ తయారీ ఆధారిత వృద్ధిపై దృష్టి సారించొద్దనే సూచనలను పక్కన పెట్టేయాలన్నారు. సేవారంగంలో ఉన్న కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూనే తయారీని సైతం చేపట్టాలని సూచించారు. చైనా తరహాలో తయారీపై కాకుండా భారత్‌ కేవలం సేవలపై మాత్రమే దృష్టి సారించాలని పలు సందర్భాల్లో ఆర్థిక నిపుణులు సూచించారు. ఈ నేపథ్యంలోనే సీతారామన్‌ తాజా వ్యాఖ్యలు చేశారు.

గత బడ్జెట్ల మాదిరే ఈ సారి బడ్జెట్టూ

వచ్చే ఏడాది కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఎలా ఉండబోతోందనే దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. గత బడ్జెట్‌ల స్ఫూర్తిని రాబోయే బడ్జెట్‌లోనూ కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రిగా వరుసగా ఐదోసారి వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న బడ్జె్ట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మాట్లాడారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ విషయంలో గత బడ్జెట్ల స్ఫూర్తిని కొనసాగించనున్నట్లు చెప్పారు. 25 ఏళ్ల దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే దానికి సంబంధించిన పునాదులు వేశామని, దాన్నే కొనసాగించనున్నామని తెలిపారు.

అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం అదుపునకు చేపట్టిన వడ్డీ రేట్ల పెంపు వల్ల కొన్ని నెలలుగా దేశ జీడీపీ మందగమనంలో ఉంది. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించడం ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.8 శాతం నమోదవ్వొచ్చన్న ఆర్‌బీఐ అంచనాల నేపథ్యంలో వచ్చే ఏడాది బడ్జెట్‌కు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ద్రవ్యోల్బణం, డిమాండ్‌ను పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం వృద్ధిని అందుకోవడం వంటి సవాళ్లకు పరిష్కారం చూపాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు