Tata Play IPO: రహస్యంగా ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న తొలి కంపెనీ టాటా ప్లే!

సెబీ గత నెలలో ఐపీఓకి సంబంధించిన కొన్ని నిబంధనల్ని సవరించింది. అందులో భాగంగా పబ్లిక్‌ ఇష్యూ వివరాలేవీ బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. ఈ విధానంలో తొలుత టాటా ప్లే సెబీకి పత్రాలు సమర్పించింది.

Published : 02 Dec 2022 14:37 IST

ముంబయి: ప్రి-ఫైలింగ్‌ మార్గాన ఐపీఓకి దరఖాస్తు చేసుకున్న తొలి కంపెనీగా టాటా ప్లే (గతంలో టాటా స్కై) నిలిచింది. నవంబరు 29న ఈ కంపెనీ రహస్యంగా సెబీకి పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన ముసాయిదా పత్రాలను సమర్పించింది. పత్రికల్లో ప్రకటనల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఐపీఓకి సంబంధించిన కొన్ని నిబంధనల్ని సెబీ గత నెలలోనే సవరించింది. అందులో భాగంగా కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఐపీఓకి సంబంధించిన అన్ని అంశాల్లో కంపెనీకి స్పష్టత వచ్చే వరకు ఈ వివరాల్ని రహస్యంగా ఉంచొచ్చు. ముసాయిదా పత్రాలు కేవలం సెబీకి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యామ్నాయ విధానాన్ని రహస్య ఫైలింగ్‌గా పేర్కొంటున్నారు. ఇది అమెరికాలో ఇప్పటికే అమల్లో ఉంది.

ఐపీఓ దరఖాస్తుపై సెబీ తమ పరిశీలనలను సంస్థకు తెలియజేస్తుంది. తదనుగుణంగా కంపెనీలు మార్పులు చేసి మరోసారి పత్రాలు సమర్పించాలి. అప్పుడు మాత్రం వివరాల్ని బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఐపీఓకి వెళ్లేందుకు కంపెనీలు కచ్చితంగా నిర్ణయించుకునే వరకు వ్యాపారపరమైన రహస్యాలు బహిర్గతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే సెబీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై చాలా కంపెనీలు ఈ మార్గాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని