Aadhaar: ఆధార్‌ లింక్డ్‌ ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ వెరిఫికేషన్‌కు కొత్త ఫీచర్‌

ఆధార్ (Aadhaar)కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ప్రస్తుతం తాము ఉపయోగించేవా? కాదా? అని తెలుసుకునేందుకు వీలుగా ఉడాయ్‌ (UIDAI) కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

Published : 03 May 2023 01:07 IST

దిల్లీ: ఆధార్‌ (Aadhaar)కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ వెరిఫికేషన్‌ కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. చాలా మంది యూజర్లకు ఆధార్‌ నమోదు సందర్భంగా ఇచ్చిన ఫోన్‌ నంబర్‌, ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్‌ వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఆధార్ ఓటీపీ వారి గతంలో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు వెళుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉడాయ్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగానే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ ఒక ప్రకటనలో  తెలిపింది. దీంతో యూజర్లు తమ ఆధార్‌ కార్డ్‌కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ప్రస్తుతం ఉపయోగించేవా? కాదా? అనేది తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఉడాయ్‌ వెబ్‌సైట్‌ లేదా ఎమ్‌ఆధార్‌ (mAadhaar) యాప్‌లో Verify Email/ Mobile Number సెక్షన్‌ ద్వారా ఉపయోగించవచ్చు. 

‘‘ ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమ ఆధార్‌తో అనుసంధానమైన మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ను వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్‌ ఉపయోగిస్తున్న మెయిల్‌, ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం కాకపోతే దగ్గర్లోని ఆధార్‌ వెరిఫికేషన్‌ సెంటర్‌కి వెళ్లి అప్‌డేట్ చేసుకోమని సూచిస్తుంది. చాలా మంది యూజర్లకు తమ ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ గురించి అవగాహన లేకపోవడంతో.. ఆధార్‌ ఓటీపీలు వేరే ఫోన్‌ నంబర్‌లకు వెళుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్తగా తీసుకొస్తున్న Verify Email/ Mobile Number ఫీచర్‌తో యూజర్‌ ఉపయోగిస్తున్న ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ గురించి తెలుసుకోవచ్చు’’ అని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. 

ఆధార్‌ యూజర్లు ఉడాయ్‌ లేదా ఎమ్‌మొబైల్‌ యాప్‌ ఓపెన్‌ చేసి అందులో వెరిఫై ఈమెయిల్‌/మొబైల్‌ నంబర్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్‌ నంబర్‌, మెయిల్‌ లేదా ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి వెరిఫికేషన్‌ బటన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ మీ ఫోన్‌ నంబర్‌/మెయిల్‌ ఆధార్‌తో అనుసంధానమైతే వెరిఫైడ్‌ అని చూపిస్తుంది. లేకపోతే అప్‌డేట్ చేసుకోమని సూచిస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని