Nitin gadkari: ఐదేళ్లలో అమెరికా తరహా రహదారులు: గడ్కరీ

Nitin gadkari on Roads: ఐదేళ్లలో భారత రహదారులు అమెరికాను తలపించనున్నాయని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు. ప్రయాణ సమయాన్ని, ప్రమాదాలను తగ్గించడమే తమ ఉద్దేశమని చెప్పారు. 

Updated : 20 Dec 2023 20:38 IST

Nitin gadkari | తిరువనంతపురం: దేశంలో రహదారులను మరింత మెరుగుపరచనున్నామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin gadkari) అన్నారు. రాబోయే ఐదేళ్లలో అమెరికా తరహా రోడ్లు భారత్‌లో దర్శనమివ్వనున్నాయని చెప్పారు. ప్రయాణ సమయాన్ని తగ్గించడం తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో రహదారుల నిర్మాణానికి రూ.50 లక్షల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఫలానా కాంట్రాక్ట్‌ మంజూరు చేయాలని ఏ ఒక్క గుత్తేదారూ తమ వద్దకు రావాల్సిన పనిలేదని, పనుల విషయంలో తాము పారదర్శకంగా ఉంటామని గడ్కరీ చెప్పారు. రహదారి మంత్రిత్వశాఖ, కాంట్రాక్టర్లు, బ్యాంకర్లు ఒక కుటుంబంలా తాము భావిస్తామని పేర్కొన్నారు. అందుకే ఏడు ప్రపంచ రికార్డులు సాధించగలిగామని చెప్పారు. ఈ మేరకు మనోరమ ఇయర్‌బుక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలు పేర్కొన్నారు.

‘‘రాబోయే ఐదేళ్లలో దేశ రహదారుల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అమెరికా రహదారులను తలపించనున్నాయి’’ అని గడ్కరీ చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా పేదరికాన్ని, నిరుద్యోగాన్ని పారదోలడం వీలు పడుతుందన్నారు. ఆటోమొబైల్‌ సెక్టార్‌ మరింత విస్తరిస్తోందని గడ్కరీ చెప్పారు. ఇటీవలే జపాన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీని భారత్‌ అధిగమించి మూడో స్థానానికి చేరిందన్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ పరిశ్రమ రూ.7.5 లక్షల కోట్లకు చేరిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక జీఎస్టీ ఈ సెక్టార్‌ నుంచే వస్తోందన్నారు. ఈ రంగంలో 4.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ రంగం రూ.15 లక్షల కోట్లకు చేరాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. అన్ని రంగాల్లో భారత్‌ రాణిస్తోందని, భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని చెప్పారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో జమ చేస్తున్నారా? నామినీలను చేర్చేందుకు ఇంకొన్ని రోజులే గడువు!

ప్రస్తుత శిలాజ ఇంధనాల స్థానంలో ఎలక్ట్రిక్‌, ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలు రావాల్సిన అవసరం ఉందని గడ్కరీ అన్నారు. అప్పుడే రూ.16 లక్షల కోట్లుగా ఉన్న దిగుమతుల బిల్లు తగ్గుతుందన్నారు. ఇప్పటికే పెట్రోల్‌తో కాకుండా ఇథనాల్‌తో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇథనాల్‌ వినియోగడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాద మరణాలను 50 శాతం తగ్గించాలన్న లక్ష్యాన్ని నెరవేర్చలేకపోయామన్నారు. రహదారుల డిజైన్లలో లోపం, అవగాహనా  లోపం, చట్టాలను ప్రజలు గౌరవించకపోవడం వంటివి ఇందుకు కారణమని గడ్కరీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని