Apple CEO: ‘వారైతేనే బాగుంటుంది’.. యాపిల్‌ నెక్ట్స్‌ సీఈఓపై టిమ్ కుక్‌

యాపిల్‌ తదుపరి సీఈఓగా ఎవరైతే బాగుంటుందనే దానిపై యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్ తన మనసులో మాటను బయటపెట్టారు. యాపిల్‌ కంపెనీలోనే ఒకరైతే బాగుంటుందని చెప్పారు.

Published : 23 Nov 2023 01:55 IST

Tim cook on Apple CEO | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెక్‌ కంపెనీ యాపిల్‌కు సీఈఓ తదుపరి ఎవరు అనే అంశంపై ప్రస్తుత సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim cook) తన మనసులో మాటను బయటపెట్టారు. దాదాపు 12 ఏళ్లుగా యాపిల్‌ సీఈఓగా వ్యవహరిస్తున్న ఆయన.. కంపెనీకి తన వారసుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పారు. యాపిల్‌ కంపెనీలో పనిచేస్తున్న ఒకరే ఆ బాధ్యతలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 

బీబీసీ నిర్వహించిన ఓ పాడ్‌కాస్ట్‌లో టిమ్ కుక్‌ తాజాగా పాల్గొన్నారు. పాప్‌ సింగర్‌ దువా లిపా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. యాపిల్‌ నుంచి ఒకరు సీఈఓ అయితే బాగుంటుందని టిమ్‌ కుక్‌ చెప్పారు. పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. ‘‘సీఈఓగా ఎవరైతే బాగుంటుందనేది పేరు నేను చెప్పను. నా వారసుడిగా పనిచేయగల సమర్థత కలిగిన వ్యక్తులను తయారు చేయడం మాత్రమే నా పని. సీఈఓ ఎంపికలో కంపెనీకి సమగ్ర ప్రణాళిక ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం’’ అని కుక్‌ అన్నారు.

1998లో యాపిల్‌లో చేరిన టిమ్‌ కుక్‌.. వివిధ స్థాయిల్లో పనిచేశారు. సీఓఓగానూ వ్యవహరించారు. స్టీవ్‌ జాబ్స్ మరణానికి కొన్ని రోజుల ముందు 2011లో సీఈఓగా బాధ్యతలు అందుకున్నారు. దాదాపు 12 ఏళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. 10 ఏళ్లకు మించి తాను ఆ పదవిలో ఉండకపోవచ్చని రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టిమ్‌ కుక్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని