Whatsapp: ఒక్క నెలలోనే 74 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం..ఎందుకంటే!

భారత్‌లో నూతన ఐటీ నిబంధనలను పాటించని 74.2 లక్షల అకౌంట్లను నిషేధించినట్లు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వెల్లడించింది.

Updated : 02 Oct 2023 16:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ యూజర్లకు వాట్సాప్‌ (Whatsapp) మరోసారి షాకిచ్చింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను ఆధారంగా లక్షలాది ఖాతాలపై నిషేధం విధించింది. నూతన ఐటీ నిబంధనలను అనుసరించి కేవలం ఆగస్టు నెలలోనే 74.2 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు వాట్సాప్‌ తాజాగా వెల్లడించింది. జులై నెలతో పోల్చుకుంటే ఈ సంఖ్య దాదాపు 2 లక్షలకు పైగా ఎక్కువ. ఆగస్టులో నిషేధం విధించిన మొత్తం అకౌంట్లలో 35 లక్షలకు పైగా ఖాతాలపై ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. వీటిపై వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, కానీ, ఆయా ఖాతాల డేటాను విశ్లేషించి ముందుగానే నిషేధించినట్లు పేర్కొంది. మరోవైపు సెప్టెంబరు నెలలో 72.28 లక్షల ఖాతాలను నిషేధించగా.. అందులో 3.1 లక్షల అకౌంట్లను ముందస్తు చర్యల్లో భాగంగానే నిలిపివేశారు.

సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న ఎండ్‌ - టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్‌ సర్వీసులో తాము అగ్రగామిగా ఉన్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది. అంతేకాకుండా వాట్సాప్‌ యూజర్లకు భద్రతపరంగా మెరుగైన సేవలు అందించేందుకు, ఫిర్యాదులను విశ్లేషించి తగిన చర్యలు తీసుకునేందుకు వాట్సాప్‌ ప్రత్యేక చర్యలు చేపడుతోందని అక్టోబరు నెల రిపోర్టులో పేర్కొంది. అనుభవజ్ఞులైన ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, విశ్లేషకులను ఇప్పటికే నియమించుకున్నట్లు తెలిపింది. అనుమానిత ఖాతాల డేటాను విశ్లేషించి వాటిపై నిషేధం విధించడం లేదా, హెచ్చరించడం తదితర చర్యలు తీసుకుంటారని పేర్కొంది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్‌ తీసుకున్న చర్యల వివరాలను కూడా రిపోర్టులో పొందుపరిచింది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల యూజర్లు ఉన్న ప్రతి సామాజిక మాధ్యమ సంస్థ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడంతోపాటు యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపరచాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని