Anand Mahindra: చైనా ఆధిపత్యానికి భారత్‌ సవాల్‌గా మారాలి: ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ప్రత్యేక సందేశమిచ్చారు. చైనా ఆధిపత్యానికి భారత్‌ ప్రత్యామ్నాయంగా మారాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

Published : 01 Jan 2024 17:12 IST

దిల్లీ: చైనా (China) సరఫరా గొలుసు (supply-chain) ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేలా భారత్‌ (India) నిలవడం ఈ ప్రపంచానికి అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) అభిప్రాయపడ్డారు. 2024లో మనకు లభించే గొప్ప అవకాశం ఇదేనన్నారు. ఇక, ఈ ఏడాది మన దేశానికి పెట్టుబడులు కూడా పెరుగుతాయని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం (New Year 2024) సందర్భంగా ఇచ్చిన సందేశంలో మహీంద్రా ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘జనవరి 1 అంటే కేవలం క్యాలెండర్‌లో మారే తేదీ మాత్రమే కాదు. ఇది చాలా ప్రత్యేకం. కొత్త ఆరంభానికి చిహ్నం. గతేడాది ఎంత చీకటిగా గడిచినా.. భవిష్యత్తు కోసం ఆశాజనకంగా ఉండే సామర్థ్యం మనకు ఉంది. 2023.. యుద్ధాలు, వాతావరణ మార్పుల సంవత్సరంగా నిలిచింది. కొత్త ఏడాదిలో వాటి నుంచి బయటపడి పునరుజ్జీవం కోరుకుంటూ 2023కు ప్రపంచం ముగింపు పలికింది. అలాంటి ఆశావహ దృక్పథానికి ఈ కొత్త ఏడాదిలో తొలి రోజు సరికొత్త అవకాశం కల్పిస్తుంది. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’’ అని మహీంద్రా రాసుకొచ్చారు.

UPI చెల్లింపుల్లో కొత్త మార్పులు.. నేటి నుంచే!

ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వేదికపై మనకున్న అవకాశాల గురించి మహీంద్రా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో చైనా సరఫరా గొలుసు ఆధిపత్యాన్ని సవాల్‌ చేసేలా భారత్‌ ప్రత్యామ్నాయంగా మారడం ఈ ప్రపంచానికి అవసరం. ఈ కొత్త ఏడాదిలో మనకు వచ్చిన గొప్ప అవకాశమిది. భారత్‌ తయారీ రంగం అద్వితీయ ఘనత సాధించే అవకాశం మనపైనే ఆధారపడి ఉంది. దాన్ని మనం రెండు చేతులతో ఒడిసిపట్టుకోవాలి. తయారీ, ఎగుమతులు పెరిగితే వినియోగ రంగం కూడా విస్తరిస్తుంది’’ అని మహీంద్రా వెల్లడించారు.

గతేడాది అనేక సవాళ్లను దాటుకుని భారత్‌ అసాధారణ విజయాలను నమోదు చేసిందని ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు. ఈ కొత్త ఏడాదిలోనూ మనం మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. 2024లో మన దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని