logo

TS News: ఎంత పనిచేస్తివి బిడ్డా!

దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రమ్యను మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఆనంద్‌కు ఇచ్చి 2017లో వివాహం చేశారు. వీరి సంసార జీవితంలో మొదటగా...

Updated : 07 Jan 2022 08:46 IST

నిండు గర్భిణి బలవన్మరణం

మంచిర్యాలనేరవిభాగం, న్యూస్‌టుడే:  అమ్మ కడుపులో పడగానే.. ఆ చిన్నారి ఎగిరి గంతేసింది.. కాలం గడిచేకొద్దీ కాళ్లు ఆడిస్తూ.. కనురెప్పల్లో కలలు అల్లుకుంది.. గుండెకు ఓ ఆకారం రాగానే.. దాని నిండా అనుభూతులు నింపుకొంది.. కనులు తెరిచే సమయం ఆసన్నం అవుతుండటంతో.. ఊపిరి బిగపట్టి.. ఆ అమృత గడియల కోసం ఆత్రుతగా ఎదురుచూసింది.. అమ్మఒడిలో హాయిగా ఎదగాలని ఉవ్విళ్లూరింది.. కానీ అమ్మకు ఏమైందో..ఏమో తెలియదు కానీ.. కొమ్మను తుంచేసింది.. తానూ కన్ను మూసింది. 

ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, ఎస్సై కిరణ్‌ వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన రమ్యను మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన ఆనంద్‌కు ఇచ్చి 2017లో వివాహం చేశారు. వీరి సంసార జీవితంలో మొదటగా ఆరాధ్య(3) జన్మించింది. ప్రస్తుతం రమ్య తొమ్మిది నెలల గర్భిణి. గురువారం ఆమెకు వైద్యులు ప్రసవం తేదీని ఖరారు చేశారు. తనకు మొదట ఆడపిల్ల పుట్టిందని, ఇప్పుడు కూడా ఆడపాప జన్మిస్తుందేమోనని గత కొద్దిరోజులుగా రమ్య దిగాలు పడింది. ఆడపాప అయినా మగబిడ్డ  అయినా.. ఏమీకాదని రమ్యకు భర్తతో పాటు అత్తింటి, పుట్టింటి వారు నచ్చజెప్పేవారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ  లేని సమయంలో రమ్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యుల రోదనతో జిల్లా ఆసుపత్రి దద్దరిల్లింది. ‘ఎంత పనిచేస్తివి బిడ్డా’..అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుడుతుందేమోనన్న అనుమానంతో తనువు చాలించడాన్ని అయినవాళ్లంతా తట్టుకోలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని