logo

మన బడి.. హంగులతో నిండి!

సర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం  మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో మొదటి విడతగా జిల్లాలో 260 విద్యాలయాలను ఎంపిక చేశారు.

Published : 01 Feb 2023 04:11 IST

నేడు  ప్రారంభించనున్న మంత్రి ఐకేరెడ్డి
నిర్మల్‌ అర్బన్‌, న్యూస్‌టుడే

సమకూరిన మూత్రశాలలు, మరుగుదొడ్లు

నిధులు (సుమారు రూ.కోట్లలో..)
మొత్తం వ్యయం : 82
విడుదలైనవి : 12

ర్కారు బడుల బలోపేతం కోసం ప్రభుత్వం  మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో మొదటి విడతగా జిల్లాలో 260 విద్యాలయాలను ఎంపిక చేశారు. అందులో రూ.30 లక్షల్లోపు 178 ఉండగా.. ఇప్పటికే 120 చోట్ల 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిలో 50 శాతానికి పైగా అయ్యాయి. మండలానికి రెండు చొప్పున 38 బడులను నమూనాగా తీర్చిదిద్దాలని విద్యాశాఖ ప్రణాళికలు రూపొందించగా.. వీటిలో 27 చోట్ల పనులు పూర్తయ్యాయి. రూ.30 లక్షలకు పైగా ఉన్నవి 82 ఉండగా.. 42 పాఠశాలలకు టెండర్లు పూర్తయి పనులు ప్రారంభించారు. 40 బడులకు సంబంధించినవి టెండరు దశలో ఉన్నాయి.  

సమకూరిన వసతులు..

పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ శాఖల పర్యవేక్షణలో పనులు జరిగి బడుల రూపురేఖలు మారాయి.   నూతన హంగులు సంతరించుకున్నాయి. ముఖ్యంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటివి సమకూరడం, ఊరిసే గదులకు మరమ్మతులు, వంట గదులు, విద్యుదీకరణ, తాగునీటి వసతి వంటివి సమకూరి పిల్లల ఇక్కట్లు తొలిగాయి. నమూనాగా తీసుకున్న 38 బడుల్లో పిల్లల సౌకర్యార్థం రంగురంగుల డ్యూయల్‌ డెస్క్‌ బెంచీలు, 230 గ్రీన్‌ చాక్‌బోర్డులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నిర్మల్‌ గ్రామీణ మండలం ఎల్లపల్లిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ముథోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు హాజరై ప్రారంభించనున్నారు.


నిర్మల్‌ గ్రామీణ మండలం ఎల్లపల్లి ఎంపీయూపీఎస్‌లో ప్రస్తుతం 104మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ మౌలిక వసతులు కరవై పిల్లలు అనేక ఇబ్బందులెదుర్కొనే వారు. మన ఊరు-మన బడి కింద మొదటి విడతలో నమూనాగా తీర్చిదిద్దాలనుకున్న దాంట్లో ఇది ఒకటి. రూ.11.22 లక్షలతో.. గ్రీన్‌ చాక్‌బోర్డు, డ్యుయల్‌ డెస్క్‌ బెంచీలు, విద్యుదీకరణ, రంగులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. మంత్రి ఐకేరెడ్డి చేతుల మీదుగా అధికారికంగా బుధవారం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌ ప్రాథమిక పాఠశాల నాటి, నేటి చిత్రాలివి. ఏళ్ల కిందట నిర్మించిన భవనం కావడం, వరండాలోని ఓ పక్క భాగంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న గోడ, వర్షానికి ఊరిసే గదుల మధ్య కాలం వెళ్లదీశారు ఇక్కడి విద్యార్థులు. ప్రస్తుతం మౌలిక వసతులు సమకూరి విద్యార్థుల ఇక్కట్లు తీరనున్నాయి.


ఏర్పాట్లు పూర్తి

రవీందర్‌రెడ్డి, డీఈవో, నిర్మల్‌

ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించనున్న ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరు కానున్న నేపథ్యంలో అట్టహాసంగా జరిపేలా ఏర్పాట్లు చేశాం. నమూనాగా తీర్చిదిద్దుతున్న వాటిలో పనులు పూర్తయ్యాయి. మిగతా వాటిలోనూ 90శాతం అయ్యాయి. ప్రభుత్వ విద్యాలయాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేలా, విద్యాపరంగానూ ప్రత్యేకత చూపేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని