logo

ఈత కారాదు గుండెకోత

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి.

Updated : 29 Mar 2024 06:28 IST

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ క్రీడావిభాగం

సొనాల మండలంలోని గొల్లాపూర్‌ చెరువులో ఈత కొడుతున్న యువకులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా విభిన్న వాతావరణానికి పెట్టింది పేరు. ఇక్కడ వర్షాలు, చలి, ఎండ.. అన్నీ ఎక్కువే. మార్చిలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటుతున్నాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం చిన్నారులు, యువకులు, పెద్దలు ఈత కొట్టేందుకు వ్యవసాయ బావులు, చెరువులు, కాలువలు, కుంటలను ఆశ్రయిస్తుంటారు. నీటిలోతు తెలియక మునిగి తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హోలీ పండగ రోజు అయిదుగురు ఈత రాక మృత్యువాతపడ్డారు. రాబోయేది వేసవి కాలం, పైగా విద్యార్థులకు సెలవులు. ఈ నేపథ్యంలో ఈతకు వెళ్లే సందర్భాల్లో తీసుకోవాల్సిన చిన్నపాటి జాగ్రత్తలను వివరిస్తూ ‘న్యూస్‌టుడే’ కథనం.


పాటించాల్సిన జాగ్రత్తలు..

  • ఈత శిక్షకుల వద్ద నేర్చుకోవాలి.
  • కొత్తగా నేర్చుకునేవారు 3 లేదా 4 అడుగుల నీటి లోతు వరకు మాత్రమే వెళ్లాలి.
  • బావులు, కాలువలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు వాటి లోతును పరిశీలించాలి.
  • ఈత రానివారు ట్యూబులు, బెండులను వినియోగించాలి. వాటిని ఎప్పటికప్పుడు గమనించి సరి చేసుకోవాలి.
  • తక్కువ నీరు ఉన్న ప్రదేశంలోనే వెళ్లాలి.
  • ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం వద్దు. అవి ప్రాణాలకే ముప్పు అవుతుంది.
  • ఈత బాగా వచ్చిన పెద్దల సమక్షంలో చెరువులు, కుంటలు, బావుల్లో దిగాలి.
  • కాలువల్లో ఈత నేర్చుకునేవారు అప్రమత్తంగా ఉండాలి. నీటి ప్రవాహం నిరంతరంగా, వేగంగా ఉంటుంది. కొన్ని చోట్ల సుడులు ఉంటాయి. తూము ఉన్న ప్రదేశంలో దిగి ప్రమాదం తెచ్చుకోవద్దు.
  • ఈత కొలనులో ఈత నేర్చుకునేందుకు పిల్లలను పంపించే ముందు తల్లిదండ్రులు అక్కడ అనుభవజ్ఞులైన శిక్షకులు ఉన్నారా, రక్షణ చర్యలు ఉన్నాయా, లైఫ్‌గార్డ్‌లు అందుబాటులో ఉంటారా వంటి విషయాలు తెలుసుకోవాలి.
  • ఈత నేర్చుకునే వారు తప్పనిసరి హెడ్‌క్యాప్‌, ఇయర్‌ప్లగ్స్‌ వాడాలి. అవి వెంట్రుకలు, చెవులకు రక్షణ ఇస్తాయి.
  • మత్తు పదార్థాలు, మద్యం తీసుకుని ఈత కొట్టరాదు.

హోలీ రోజు మృత్యు ఘంటికలు..

  • గతడిచిన అయిదేళ్లలో ఉమ్మడి జిల్లాలో 68 మంది ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు.
  • ఈ హోలీ రోజున ఆదిలాబాద్‌కు చెందిన సాత్విక్‌(14) భీంసరి వాగులో స్నానం చేస్తుండగా మృత్యువాత పడ్డారు. కౌటాల మండలం నదీమాబాద్‌ తాటిపల్లి గ్రామం వద్ద పెన్‌గంగా నదిలో స్నానానికి దిగిన ఆలం సాయి(23), ఉప్పుల సంతోష్‌(23), ఎల్ములే ప్రవీణ్‌(24), పనస కమలాకర్‌(24) ఈత రాక మృతి చెందారు.

శిక్షకుల సమక్షంలో నేర్చుకోవాలి
- కొమ్ము కృష్ణ, ఈత శిక్షకుడు

కొత్తవారు, సాధకులు తప్పనిసరి ఈత శిక్షకులు, నిపుణుల పర్యవేక్షణలో నీటిలోకి  దిగాలి. వారి సమక్షంలో ఈత నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే 8 అడుగుల నీటి లోతులో దిగి ఈత కొట్టాలి. భయం, గాబరా పడితే ఎప్పటికీ ఈత రాదు. ధైర్యం ఉన్నవారే ఈతలో రాణించగలుగుతారు. పూర్తిగా తర్ఫీదు పొందిన తర్వాతే ఒంటరిగా ఈత కొట్టేందుకు వెళ్లాలి.


మంచి వ్యాయామం
- డా.క్రాంతికుమార్‌, ఎం.డి.జనరల్‌ ఫిజీషియన్‌

ఈత ఆరోగ్యానికి మంచిదే. రోజూ గంటపాటు ఈత కొడితే శరీరానికి కావాల్సిన వ్యాయామం లభిస్తుంది. ముందుగా వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. తమ ఆరోగ్య చరిత్ర వివరించాలి. వైద్యులు సిఫార్సు చేస్తేనే ఈత నేర్చుకోవాలి. ఆస్తమా, హృద్రోగులు, మూర్ఛ వ్యాధి ఉన్నవారు నీటిలోకి దిగొద్దు. కొత్తగా ఈత నేర్చుకునేటప్పుడు వారి తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని