logo

ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు

నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు.

Published : 25 Apr 2024 06:36 IST

బ్యాంకు ఖాతాల లావాదేవీలపై విచారణ

ఆసిఫాబాద్‌ ఎస్‌బీఐలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి

ఈనాడు, ఆసిఫాబాద్‌: నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో పరిహారం చెల్లింపు చేసిన వివరాలు తీసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఎస్‌బీఐ నుంచి రెవెన్యూ అధికారుల ఖాతాకు డబ్బులు పంపిన దస్త్రాలను పరిశీలించారు. డీఎస్పీ వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ.. 2018-19లో రహదారి విస్తరణలో భాగంగా ఆసిఫాబాద్‌ పట్టణ సమీపంలో సర్వే నం.9, 10లలో 6.12 ఎకరాల భూమిని సేకరించారు. నిబంధనల మేరకు కాకుండా కావాలని మార్కెట్ ధర కన్నా ఎక్కువగా చెల్లింపులు చేసినట్లుగా ఫిర్యాదులు అందాయి. ఈ తరుణంలో అప్పుడు ఆర్డీఓగా పనిచేసిన సిడాం దత్తు, సీనియర్‌ అసిస్టెంట్ నాగోరావు, సర్వేయర్‌ భరత్‌లపై విచారణ చేస్తున్నాం. వీరికి ఎవరి ఖాతాల నుంచి ఎంత మేరకు డబ్బులు పంపించారో ఎస్‌బీఐ బ్యాంకులో వివరాలు తీసుకున్నాం. ప్రాథమిక విచారణ పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి పూర్తి వెల్లడిస్తామని డీఎస్పీ వివరించారు.

వెలుగులోకి ఇలా..

జిల్లా కేంద్రం శివారు ప్రాంతంలో గొల్లగూడ వెళ్లే మార్గంలో సర్వే నం.9, 10లో స్థిరాస్తి వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. చాలా మంది రిజిస్ట్రేషన్లు చేసుకోలేదు. అనుమతులు లేని ఈ వెంచర్ల గుండా నాలుగు వరుసల రహదారికి అవసరమైన భూమిని సేకరించారు. పంచాయతీకి రావాల్సిన 33 శాతం స్థలానికి సంబంధించిన డబ్బులు రూ.కోటి వరకు పక్కదారి పట్టించారు. ప్లాట్ల క్రయ విక్రయాలు జరిగాయని చెబుతూ మార్కెట్ ధర అమాంతంగా పెంచేశారు. రూ.ఆరు లక్షలు వచ్చే ఈ భూములకు ఏకంగా రూ.4.32 కోట్లు చెల్లించారు. ఈ అంశాలన్నీ ‘ఈనాడు’లో వరుసగా ప్రచురితమయ్యాయి. తాజాగా 2024 మార్చి 30న ‘ఈనాడు’లో ‘అర్హుల ఎదురుచూపు.. అక్రమార్కులకు చెల్లింపు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. లోపాయికారి ఒప్పందంతో స్థిరాస్తి వ్యాపారులు రెవెన్యూ అధికారులు ఎంత మేరకు చెల్లింపులు చేశారో ఆధారాలతో సహా ఈ కథనంలో ఉండగా.. ఏసీబీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. రూ.కోట్లలో సొమ్ము నొక్కేసిన ఇద్దరు వ్యక్తులు, తమ దగ్గర డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో రెవెన్యూ అధికారుల ఖాతాల్లో రూ.కోటి వరకు చెల్లింపులు చేసేశారు. ఏసీబీ అధికారుల సోదాలతో రెవెన్యూ అధికారుల్లో గుబులు రేగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని