logo

కోట్ల మంది భక్తులొస్తున్నా..కాటేజీలు లేవు..!

దుర్గగుడికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజు ఆలయ ప్రాంగణంలో నిద్రించాలన్నా సరైన సౌకర్యాలు లేవు.

Published : 13 Mar 2023 02:07 IST

గతంలో ఉన్నవీ ప్రస్తుతం లేకుండా చేశారు
సౌకర్యాలు కల్పిస్తే దుర్గగుడికి భారీగా ఆదాయం
ఈనాడు, అమరావతి

దుర్గగుడికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఒక్క రోజు ఆలయ ప్రాంగణంలో నిద్రించాలన్నా సరైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా ఆలయానికి సమీపంలో ఒక్క కాటేజీ కూడా లేదు. గతంలో ఉన్న ఒకటో అరో కాటేజీలను కూడా ఇతర అవసరాల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్నారు. తిరుపతి, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, అన్నవరం సహా రాష్ట్రంలోని ఏ పెద్ద ఆలయాన్ని చూసినా వచ్చే భక్తుల కోసం భారీ సంఖ్యలో కాటేజీలున్నాయి. ఏటా రూ.కోట్లలో ఆదాయం ఈ కాటేజీలపైనే ఆ ఆలయాలకు వస్తోంది. ఈ దేవస్థానాలకు వచ్చే భక్తులు కూడా కనీసం ఒకటి రెండు రోజులు అక్కడే ఉండేలా ప్రణాళికలు వేసుకుంటారు. దీనికి ప్రధాన కారణం అక్కడ అన్ని సౌకర్యాలతో కూడిన కాటేజీలు అందుబాటులో ఉండడమే. దుర్గగుడిలో కాటేజీలు లేకపోవడంతో వచ్చే భక్తులు ఇలా వచ్చి అలా దర్శనం చేసుకుని కొండ దిగి వెళ్లిపోతుంటారు. విజయవాడలోని ప్రైవేటు హోటళ్లలో ఉండడం ఇష్టం లేక, దర్శనం చేసుకున్న వెంటనే రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు 90 శాతం మంది వెళ్లిపోతున్నారు. ఎంత మంది ఈవోలు, పాలక మండళ్లు మారుతున్నా దుర్గగుడిలో భక్తులకు అవసరమైన కాటేజీలపై కనీస దృష్టి కూడా సారించడం లేదు.

రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గగుడికి ఏటా కోటిన్నర మందికి పైగా భక్తులు, రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ఆలయానికి అనుబంధంగా సాధారణ భక్తుల కోసం సరైన కాటేజీ ఒక్కటి కూడా లేదు. పదేళ్ల క్రితం వరకూ సాధారణ భక్తులకు అందుబాటులో కొండ దిగువనే అరండల్‌ సత్రం, ఇంద్రకీలాద్రి అతిథి గృహం, మాడపాటి సత్రం ఉండేవి. ఈ మూడింటిలో ఉన్న గదులన్నీ కలిపినా వంద లోపే ఉన్నా సాధారణ భక్తులకు అందుబాటులో ఉండేవి. కానీ వాటిని అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా.. కొన్నాళ్లు కార్యాలయాలు, ఇతర అవసరాల కోసం వినియోగించడం, మళ్లీ భక్తులకు కేటాయించడం.. ఇలా మారుస్తూ వస్తున్నారు.

ఏటేటా

తగ్గిపోతూ..రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో ఏటా సౌకర్యాలు పెరుగుతూ ఉంటే దుర్గగుడిలో తగ్గుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కొండపైనే అన్నదాన భవనం విశాలంగా ఉండేది. అమ్మవారి దర్శనం చేసుకున్న వెంటనే భక్తులు లైన్లలో వెళ్లి అన్నదానం స్వీకరించి సంతృప్తిగా వెళ్లేవారు. ప్రస్తుతం తాత్కాలికంగా మహామండపంలో అన్నదానం పెడుతున్నారు. భక్తులు అష్టకష్టాలు పడుతూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. ఏటా ఆదాయం పెరుగుతుంటే సౌకర్యాలను తగ్గించుకుంటూ రావడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కాటేజీల విషయంలో భక్తుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రైల్వేస్టేషన్‌కు సమీపంలో సి.వి.రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో ఎందుకు కట్టారో, ఎలా వినియోగించాలో కూడా తెలియక.. నాలుగు షెడ్డులను వేసి వాటిని డార్మెటరీలుగా అందుబాటులో ఉంచారు. అక్కడ భక్తులకు మంచాలను అద్దెకు ఇస్తున్నారు. కనీసం ఈ స్థలంలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా కాటేజీలను నిర్మించినా భారీగా ఆదాయం వస్తుంది. దుర్గగుడిలో కాటేజీలు ఉండవు.. అని భక్తులు మానసికంగా నిర్ణయించుకోవడం వల్లే ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయనే నమ్మకం వారికి కల్పిస్తే.. ప్రస్తుతం ఉన్న ఆదాయం కంటే రెట్టింపు వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కనీసం ఈ మూడింటినీ ఉంచినా..

కొండను ఆనుకుని ఉండే అరండల్‌ సత్రాన్ని పూర్తిగా కేశఖండనశాలగా మార్చేశారు. బ్రాహ్మణవీధిలో గతంలో భక్తులకు అందుబాటులో ఉండే జమ్మిదొడ్డి ఇంద్రకీలాద్రి అతిథి గృహంలోని గదులన్నింటినీ పడగొట్టి మూడేసి కలిపి ఒక్కో గదిగా మార్చారు. ఆ తర్వాత ఈ గదులను కొన్నాళ్లు కార్యాలయాలుగా వినియోగించారు. ప్రస్తుతం ఈవో, ఈఈ, ఏఈవోలు అందరి కార్యాలయాలు మహామండపంలోని నాలుగో అంతస్తులోకి మార్చారు. కానీ ఈ గదులను మాత్రం ఇంకా వినియోగించడం లేదు. వీటిలో మళ్లీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. జమ్మిదొడ్డిలో ఒకటో అంతస్తులో మంత్రి కార్యాలయం ఉంది. రెండు, మూడో అంతస్తుల్లోని గదుల్లో బాత్రూంలు, కిటికీలు, మంచాలు సహా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఇక మాడపాటి సత్రంలో ఉన్నవే 18 గదులు. వీటిలో ఐదు స్యూట్‌రూంలు, 13 సాధారణ గదులు. ప్రస్తుతం భక్తులకు వీటిని అందుబాటులో ఉంచారు. కానీ ఈ విషయం భక్తులకు పెద్దగా తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని