logo

సీఎంపై దాడి జరిగితే పోలీసులు ఏం చేస్తున్నట్టు?

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి సంఘటనను అధికార పార్టీ అవకాశంగా మలచుకోవాలని చూస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.

Updated : 16 Apr 2024 05:34 IST

సానుభూతి కోసం ఇదో డ్రామా
ఎమ్మెల్యే గోరంట్ల మండిపాటు

టి.నగర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి సంఘటనను అధికార పార్టీ అవకాశంగా మలచుకోవాలని చూస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయి విసరడం తప్పేనని, అయితే ఈ ఘటనతో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు మారేవిధంగా ఘటనలు ఈ నాలుగు రోజుల్లో జరగడానికి అవకాశం ఉందని వైకాపా నేతలు ముందుగా సమాచారం ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంలో రాత్రిపూట ఏకంగా మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా తొలగించడాన్ని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారన్నారు. దీనిపై డీజీపీతో పాటు పోలీస్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాల్సి ఉందన్నారు. రాయి విసిరితే నేరుగా తలపై తగలడం ఏంటన్నారు. దెబ్బ తగిలితే ప్రచారం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారన్నారు. గతంలో కోడి కత్తి డ్రామా మాదిరిగానే ఇదికూడా నాటకమేనన్నారు. ఒకేరాయి ముగ్గురికి ఎలా గాయం చేసిందన్నారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ వెంటనే ఎందుకు స్పందించలేదన్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారన్నారు. అసలు విచారణ జరగకుండా ఇది క్యాట్‌బాల్‌తో దాడి జరిగిందని ఎలా తెలుసన్నారు. ఇదంతా సానుభూతి కోసం ప్రయత్నాలు మాత్రమేనన్నారు. ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారని సానుభూతి చూపాలన్నారు. ప్రజల సొమ్మును ఇసుక, అక్రమ మద్యం, ఇతర రంగాలను కలిపి ఏకంగా లక్షా 55 వేల కోట్లను దోపిడీ చేశారన్నారు.

వినూత్న రీతిలో నిరసన: విలేకరుల సమావేశానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తలకు గాయం చేశారంటూ కట్టుకట్టుకుని బ్యాండ్‌ వేసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తనను ఆరేళ్ల బాలుడు తలపై బలంగా కొట్టాడని సానుభూతి కావాలని కోరడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని