logo

నియామకాల బూటకం.. నకిలీల నాటకం

రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.

Updated : 16 Apr 2024 05:25 IST

రాజమహేంద్రవరం వైద్య కళాశాల దుస్థితి
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం

రోగులకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలు అందజేస్తున్నామని చెబుతున్న వైకాపా సర్కారుకు క్షేత్రస్థాయి పరిస్థితులు కనిపించడం లేదు. రాజమహేంద్రవరానికి నూతన వైద్య కళాశాలను తీసుకొచ్చి 150 ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు బోలెడన్నీ ఉద్యోగ నియామకాలు చేపట్టా మంటున్నా.. పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ కళాశాలకు సంబంధించి కొన్ని పోస్టుల్లో నకిలీలు కొనసాగు తున్నారన్న అంశం.. గతేడాది నవంబరులో విడుదల చేసిన 77 పోస్టుల నియామకాల్లో జాప్యం జరుగుతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నకిలీ ఉద్యోగులను తొలగించడంతో పాటు గతేడాది విడుదల చేసిన నియామక ప్రకటనకు సంబంధించి ప్రకియను కొలిక్కి తీసుకురావాలని అంతా కోరుతున్నారు.

వివరణ కోసం ఇంకెన్ని నెలలు..

జీజీహెచ్‌, వైద్యకళాశాల పరిధిలోని 77 పోస్టులకు గత నవంబరులో నోటిఫికేషన్‌ విడుదల చేసినా నేటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2023 డిసెంబర్‌ 20 నాటికే పోస్టింగులు ఇచ్చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నియామకాలకు సంబంధించి మధ్యవర్తులు, రాజకీయ జోక్యం కారణంగా అర్హులకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వినిపించాయి. వాటి జాబితా కోసం 7,115 మంది ఎదురు చూస్తున్నా నిరాశ తప్పడం లేదు. మానసిక విభాగానికి సంబంధించి ఓ పోస్టుకు విద్యార్హతకు అభ్యర్థులు అభ్యంతరాలు తెలపడంతో దాని వివరణ కోసం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)కి లేఖ రాశామని, అక్కడ తాత్సారం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒక్కపోస్టు విద్యార్హత వివరణ కోసం మొత్తం నోటిఫికేషన్‌ను అయిదు నెలల నుంచి నిలిపివేయడం దారుణమని వాపోతున్నారు.

ప్రాణాలతో చెలగాటమే..

వ్యాధి నిర్ధారణ వంటి కీలక విభాగాల్లో నైపుణ్యంలేని వారు విధుల్లో ఉంటే ప్రాణాలతో చెలగాటమే. రాజమహేంద్రవరం వైద్య కళాశాల ఏర్పాటైనప్పుడు 2022లో కాకినాడ డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో కంబైన్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసి నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా మొత్తం 12 మంది ల్యాబ్‌టెక్నీషియన్లు ఇక్కడికి  వచ్చారు. వీరిలో అయిదుగురు తగిన అర్హత, పారామెడికల్‌ బోర్డు రిజిస్ట్రేషన్‌, దాని రెన్యువల్‌ పత్రాలు లేకుండానే ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. వీరంతా ఒకేషనల్‌ ఎంఎల్‌టీ చేసిన వారే కావడం గమనార్హం. వీరు కచ్చితంగా ఏదైనా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో క్లినికల్‌ శిక్షణ తీసుకుని దాని ఆధారంగా పారామెడికల్‌ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సి ఉంది. కొందరు శిక్షణ తీసుకోకపోవడం, మరికొందరు ధ్రువపత్రాలు సరిగా లేకపోవడం తదితర కారణంగా ప్రస్తుతం అవి రెన్యువల్‌ అవ్వడం లేదు. వీరంతా ప్రస్తుతం జీజీహెచ్‌లోని ల్యాబ్‌లో రోగులకు పరీక్షలు చేసేస్తున్నారు. ఏడాదిన్నర నుంచి వేతనాలు తీసేసుకుంటున్నారు. వారి కాంట్రాక్టు బాండు రెన్యువల్‌ సైతం తీసుకుంటున్నారు.


నకిలీలుంటే చర్యలు చేపడతాం..

- డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్‌, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల

వైద్య కళాశాలకు సంబంధించి ల్యాబ్‌ టెక్నీషియన్లలో నకిలీలు ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం. వారి విద్యార్హత, బోర్డు రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌ పత్రాలను తనిఖీ చేస్తాం. నకిలీ అని తేలితే చర్యలు చేపట్టడంతో పాటు వారి వేతనాలు రికవరీ చేసేలా అథారిటీకి లేఖ రాస్తాం. నోటిఫికేషన్‌కు సంబంధించి వైద్య విద్య సంచాలకుని కార్యాలయ ఉన్నతాధికారులతో చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరిగింది. త్వరలోనే తుది జాబితా ప్రచురించి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని