logo

ఏళ్లు గడిచినా సమస్యలు పట్టవా..?

కొవ్వూరు పట్టణ పరిధిలో క్రిస్టియన్‌పేటగా పిలిచే 3, 4 వార్డులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. మురుగు వ్యవస్థ ఇబ్బందికరంగా మారుతోంది.

Published : 17 Apr 2024 06:11 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే

సేవలకు నోచుకోని పట్టణ ఆరోగ్య కేంద్రం

కొవ్వూరు పట్టణ పరిధిలో క్రిస్టియన్‌పేటగా పిలిచే 3, 4 వార్డులను పలు సమస్యలు వేధిస్తున్నాయి. మురుగు వ్యవస్థ ఇబ్బందికరంగా మారుతోంది. కల్వర్టులు ఎత్తు తగ్గిపోయి అనుసంధాన వీధుల మురుగు రహదారులపై చేరుతోంది. డ్రైయిన్లలో వ్యర్థాలు నిలిచిపోతున్నాయి. దీంతో సాయంత్రమయితే దోమలు విజృంభిస్తున్నాయి. ఈ వార్డుల పరిధిలో పాత పైపులైను తీరుతో పలు చోట్ల నీరు వృథాగా మారుతోంది. ట్యూబులను కట్టి నెట్టుకొస్తున్నా లీకులను అరికట్టడం ప్రహసనంగా మారుతోంది. ప్రధాన వీధుల్లో జీఐ పైపులను అమరిస్తే తప్ప నీటి వెతలు తీరవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క నిధుల లభ్యత, మరో పక్క ఇప్పుడున్న పైపులైను మార్చడానికి రహదారులను తవ్వి కొత్త లైను వేయాల్సి రావడంతో పనులు పట్టాలెక్కడం లేదు. ఇదిలా ఉంటే చేతిపంపులను తొలగించడంతో వేసవిలో నీరందక పేట వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.

 శిథిలావస్థలో భవనాలు..

వాటర్‌ వర్క్స్‌ సమీపంలో సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ వసతి గృహాలు శిథిలస్థితికి చేరాయి. దీంతో విద్యార్థులు, అధికారులు, సిబ్బంది సైతం లోపలికి వెళ్లడానికి హడలిపోయే పరిస్థితి. స్థానికుల చొరవతో అధికార యంత్రాంగం కదిలి విద్యార్థులను వేరే ప్రాంతాలకు పంపించారు. శిథిలమైన భవనాల స్థానంలో కొత్తవి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. మూడో వార్డులో నిరుపయోగంగా ఉన్న తుపాను షెల్టరు భవనం వద్ద సామాజిక భవనం కట్టాలని చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు. అంబేడ్కర్‌ భవనాలు మంజూరైనా నిధులు రాక ప్రారంభం కావడం లేదు. నాలుగో వార్డులో గోదావరిమాత విగ్రహం నుంచి హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వరకు ఉన్న ప్రధాన డ్రెయినుపై సిమెంటు బల్లలు వేసే ప్రక్రియ కొంతమేరే జరిగింది. మిగిలినది పూర్తి చేయడానికి ప్రతిపాదనలు చేసినా ఆ పనులు జరగడం లేదు.

పాడైన పైపులైనుకు ట్యూబులతో కట్టిన వైనం

ఆసుపత్రి సేవలు ఎప్పుడు..

ఏళ్ల తరబడి కట్టిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ) భవనాన్ని ఎన్నికల కోడ్‌కు సంబంధం లేకుండా ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే 10 పడకలు, సేవలకు అవసరమైన యంత్రాలు, సామగ్రి సమకూరకపోవడంతో ఈ భవనం నిరుపయోగంగా మారింది. వందలాది మందికి ఉపయుక్తమైన ఆసుపత్రి విషయంలో శ్రద్ధ చూపాల్సి ఉంది.

 బొంతా కిషోర్‌, క్రిస్టియన్‌పేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని