logo

రసవత్తరంగా చీరాల రాజకీయం

జిల్లాలోని చీరాల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి తెదేపా-జనసేన-భాజపా ఆధ్వర్యంలోని కూటమి తరఫున ఎం.ఎం.కొండయ్య, వైకాపా నుంచి కరణం వెంకటేశ్‌ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి.

Updated : 10 Apr 2024 08:27 IST

కాంగ్రెస్‌లో చేరతానన్న ఆమంచి
త్రిముఖ పోటీ ఉండే అవకాశం

ఈనాడు, బాపట్ల: జిల్లాలోని చీరాల రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇక్కడి నుంచి తెదేపా-జనసేన-భాజపా ఆధ్వర్యంలోని కూటమి తరఫున ఎం.ఎం.కొండయ్య, వైకాపా నుంచి కరణం వెంకటేశ్‌ను ఆ పార్టీలు అభ్యర్థులుగా ప్రకటించాయి. దీంతో వారిద్దరూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావించారు. కానీ చీరాల వైకాపా అభ్యర్థిత్వం దక్కకపోవటంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవాలని కొంతకాలం నుంచి కృష్ణమోహన్‌ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైకాపాలోనే ఉంటూ ఆయన చీరాల అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతూ వచ్చారు. అయితే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా కరణం బలరాం కృష్ణమూర్తి ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ స్థానం నుంచి ఆయన తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వైకాపాలో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో వైకాపా అధిష్ఠానం ఆయనకు బదులు తనయుడు వెంకటేశ్‌కు అవకాశం కల్పించింది.

ఆ పార్టీ తరఫున పోటీ..

టిక్కెట్‌ దక్కక ఆమంచి వైకాపాపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల    ఆ పార్టీకి రాజీనామా చేశారు.  కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం ఆయన స్వగ్రామం పందిళ్లపల్లిలో కార్యకర్తలు, అభిమానుల సమావేశంలో తాను త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టత ఇచ్చారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించింది. చీరాల సీటు మాత్రం పెండింగ్‌ పెట్టింది. ప్రస్తుతం చీరాల టికెట్‌ ఆమంచికే వస్తుందనే ఆశతో ఆయన అభిమానులు ఉన్నారు. మంగళవారం జరిగిన అభిమానులు, సన్నిహితుల సమావేశంలో కూడా పలువురు కచ్చితంగా కాంగ్రెస్‌ నుంచి ఆమంచి పోటీ చేస్తారని తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఆమంచి రంగంలోకి దిగితే త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఆయన ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి గెలిచారు. మొత్తంగా చీరాలతో ఆయనకు గట్టి అనుబంధమే ఉంది. గత కొద్దిరోజులుగా చీరాల ప్రజలు తనను ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నారని ఆమంచి చెబుతున్నారు. ఐదేళ్ల అనంతరం చీరాల రాజకీయాల్లోకి ఆయన ప్రత్యక్షంగా రానుండటంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని