logo

బస్సుల్లేక ఉసూరుమని..

మరోసారి ప్రయాణికులకు అవస్థలు తప్ప లేదు. సోమవారం గుడివాడలో జరిగిన సిద్ధం సభకు జిల్లాలోని అయిదు డిపోల నుంచి మొత్తం 210 బస్సులను  తరలించారు.

Published : 16 Apr 2024 04:58 IST

వైకాపా సేవలో ఆర్టీసీ

పట్నంబజారు, న్యూస్‌టుడే: మరోసారి ప్రయాణికులకు అవస్థలు తప్ప లేదు. సోమవారం గుడివాడలో జరిగిన సిద్ధం సభకు జిల్లాలోని అయిదు డిపోల నుంచి మొత్తం 210 బస్సులను  తరలించారు. తెల్లవారుజాము నుంచే గుంటూరు-1, 2, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోల నుంచి సర్వీసులను గుడివాడ, ఉయ్యూరు, పామర్రు, జగ్గయ్యపేట, నూజివీడు ప్రాంతాలకు పంపించారు. దీంతో గుంటూరు ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి సోమవారం కాకాని తోటలో జరిగే ప్రార్థనలకు జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరు అవస్థలు పడ్డారు. కొందరు తెనాలి, పొన్నూరు ప్రాంతాల నుంచి అధిక ఛార్జీలు చెల్లించి ఆటోలలో కాకానితోటకు వచ్చారు. వివిధ పనుల నిమిత్తం జిల్లా నలుమూలల నుంచి గుంటూరు వచ్చిన వారు తిరిగి స్వగ్రామాలకు వెళ్లేందుకు సమయానికి బస్సులు లేక గంటల తరబడి బస్టాండులో పడిగాపులు కాచారు. విజయవాడలోని హాస్టల్‌లో ఉంటున్న తమ కుమార్తె వద్దకు వెళ్లేందుకు వచ్చిన తాను దాదాపు గంటకు పైగా గుంటూరు బస్టాండులో వేచి ఉన్నానని పురుషోత్తం అనే ప్రయాణికుడు ‘న్యూస్‌టుడే’కు వివరించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని బంధువుల్ని చూసేందుకు తెనాలి నుంచి వచ్చిన తాను తిరిగి వెళ్లేందుకు ఆటోకు రూ.150 చెల్లించినట్లు నాగేష్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా సిద్ధం సభలకు బస్సులను తరలించే ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల ఇబ్బందులను గమనించరా అంటూ ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని