logo

నీవుండే జిల్లాకూ.. నీరివ్వలేదే జగన్‌

ప్రజా పరిపాలన అంటే బటన్‌ నొక్కితే చాలనుకునే రోజులివి. నాయకుడికి ముందుచూపు లేకపోతే గుక్కెడు నీటికి కూడా అల్లాడిపోవాల్సి వస్తుందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం.

Published : 16 Apr 2024 05:22 IST

ముందస్తు ప్రణాళిక లేక ఎండిన చెరువులు
తాగునీరు లేక రోడ్డెక్కుతున్న జనం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు, మంగళగిరి, ప్రత్తిపాడు

ప్రజా పరిపాలన అంటే బటన్‌ నొక్కితే చాలనుకునే రోజులివి. నాయకుడికి ముందుచూపు లేకపోతే గుక్కెడు నీటికి కూడా అల్లాడిపోవాల్సి వస్తుందనడానికి జిల్లాలో నెలకొన్న పరిస్థితులే నిదర్శనం. పక్కనే కృష్ణానది.. వందల టీఎంసీల నీళ్లు తుపానులు, అతివృష్టి వేళ సముద్రంలోకి వృథాగా పోయాయి.. అయినా ముందుచూపు లేక చెరువులు నింపలేకపోయారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉన్నా ఆ పనీ చెయ్యలేదు. వేసవి ఎద్దడిని దృష్టిలో పెట్టుకోకుండా పులిచింతలను ఖాళీ చేశారు. ఫలితంగా గ్రామాల్లో చెరువులు ఎండిపోయి నీళ్ల కోసం జనం రోడెక్కాల్సిన పరిస్థితి దాపురించింది.

ఇదీ సీఎం నివాసం ఉండే జిల్లాలో పరిపాలన వైఫల్యం కాదా?

అడుగంటిన ప్రత్తిపాడు చెరువు

జిల్లా అంతటా డెల్టా, సాగర్‌ కాలువలు విస్తరించాయి. రెండు నెలల కిందటి వరకు కాలువల్లో నీరు ప్రవహించింది. ముందస్తు ప్రణాళిక, తగినన్ని నిధులు లేకపోవడంతో చెరువులు నింపుకోలేకపోయారు. వైకాపా ప్రభుత్వం తాగు నీటి చెరువులను నింపడంలో చేసిన నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. తాగు నీరు ఇవ్వండి మహాప్రభో అని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తామంతా అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

జిల్లాలో 9 గ్రామాల్లో తాగునీటి చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఇక్కడ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సి వస్తోంది.

సమన్వయలోపంతో..

  • నాగార్జునసాగర్‌, డెల్టా కాలువల నుంచి వచ్చే నీటితో చెరువులు నింపడం ద్వారా తాగు నీటి సరఫరా జరుగుతోంది. సాగర్‌ కాలువలకు మార్చి నెలలోనూ నీటిని విడుదల చేసినా యంత్రాంగం సమన్వయ లోపంతో నీటిని చెరువులకు పూర్తి స్థాయిలో నింపలేదు. జిల్లాలో చెరువులు అడుగంటడంతో తాగు నీటి ఎద్దడి తీవ్రమైంది.
  • పల్లెవాసులు వ్యవసాయ బోరు బావుల నుంచి ట్రాక్టర్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుని వాడుకుంటున్నారు. సమ్మర్‌ స్టోరేజి చెరువుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఒక్కో పథకం కింద 10 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. డబ్బులు ఉన్నవారు నీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. పేదలు చేతిపంపు నీటితో కాలం వెళ్లదీస్తున్నారు.

కాలువలకు నీరు విడుదల

సాగర్‌ కాలువలకు ఈ నెల 8 నుంచి 5500 కూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లా పరిధిలోని 33 తాగు నీటి చెరువులకు ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. ఈ నెల 22న కాలువలకు నీరిస్తారు. డెల్టా కాలువలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. చివరలో ఉన్న బాపట్ల జిల్లాలో చెరువులను ముందు నింపిన తర్వాత గుంటూరు జిల్లాలో చెరువులకు నీటిని సరఫరా చేయనున్నారు. దీంతో మరో వారం రోజులు నీటి కష్టాలు తప్పవు.

నిధుల్లేక అవస్థలు..

జిల్లాలో వేసవిలో ఎద్దడి నివారణకు రూ.5.57 కోట్లతో గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏప్రిల్‌ 15వ తేదీ దాటినా నిధుల ఊసే లేదు. చెరువులు నింపడానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.


మిక్చర్‌ కాలనీలో ఖాళీ బకెట్లు చూపుతూ నిరసన తెలుపుతున్న స్థానికులు

ఇదీ రాజధాని పరిధి నెక్కల్లు గ్రామంలోని మిక్చర్‌కాలనీ. సుమారు 300 జనాభా ఉంది. నెక్కల్లులో ఓవర్‌హెడ్‌ ట్యాంకు ఉన్నా ఈ కాలనీకి పైపులైన్లు వేయలేదు. కాలనీలో బోరు వేసి మోటారు పెట్టి అక్కడక్కడా కుళాయిలు బిగించారు. మోటారుకు వచ్చే కరెంటు బిల్లును స్థానికులే కట్టాల్సి వస్తోంది. బకాయిలు ఉన్నాయన్న కారణంగా విద్యుత్తు శాఖ అధికారులు కనెక్షన్‌ తొలగించి మీటర్లు తీసుకెళ్లారు. పది రోజులుగా అర కి.మీ దూరంలోని చేతిపంపుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సమస్యపై అధికారులు స్పందించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఖాళీ బకెట్లు పట్టుకుని నిరసన తెలిపారు. 


మంగళగిరిలో నీటి పథకం కోసం తెచ్చిన పైపులు

కృష్ణానది చెంతనే ఉన్నా మంగళగిరిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కరవయ్యాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.230 కోట్లతో 75 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 2050 నాటికి పెరిగే జనాభా అవసరాలకు తగినట్లుగా నీటి పథకానికి రూపకల్పన చేశారు. దీనికి టెండర్లు పిలిచారు.ఆ తరువాత వైకాపా అధికారంలోకి రావడం, అయిదేళ్లు గడుస్తున్నా నిధులు విడుదల కాక అది కార్యరూపం దాల్చలేదు. వైకాపా ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా దుస్థితి మారలేదు. తాడేపల్లిలో రక్షిత నీరు ఇవ్వట్లేదు.బోరు నీటిని కొళాయిల ద్వారా ఇస్తున్నారు. టీడీఎస్‌ ఎక్కువగా ఉండడంతో ఈ నీటితో వండిన అన్నం పచ్చగా అవుతోంది. 2లక్షల మంది జనం అవస్థలు పడుతున్నారు.


ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై రాస్తారోకో

గ్రామంలోని తాగు నీటి చెరువును నింపి దాహార్తి తీర్చాలని డిమాండ్‌ చేస్తూ ప్రత్తిపాడులో స్థానిక మహిళలతో కలిసి వైకాపా నాయకులే ఇలా రోడ్డెక్కారు. గుంటూరు- పర్చూరు రోడ్డుపై బైఠాయించి సోమవారం నిరసన తెలిపారు. ఈ నెల 8న సాగర్‌ జలాలు విడుదల చేశామని చెప్పిన అధికారులు వారం రోజులైనా చెరువులను నింపలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ స్పందించే వరకు వెనక్కి తగ్గమని నినాదాలు చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.15 వరకు మండుటెండలో రాస్తారోకో కొనసాగింది.చివరకు 48 గంటల్లో నీరిస్తామన్న అధికారుల హామీతో విరమించారు.


నీరు ఆపడం దారుణం : పూజల హుస్సేన్‌, నెక్కల్లు

గ్రామంలోని ప్రజలందరికీ తాగు నీరు అందించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ మిక్చర్‌ కాలనీకి ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి ఇంటింటికీ తాగునీరు సరఫరా జరగడం లేదు. స్థానికంగా ప్రభుత్వం కాలనీలో బోర్లు వేయించింది. మోటారు విద్యుత్తు బిల్లులు చెల్లించలేదని వేసవిలో తాగునీరు ఆపడం దారుణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని