logo
Published : 27 Jun 2022 02:43 IST

తీగ తెగుతోంది.. ప్రాణం తీస్తోంది

రహదారి మధ్యలో, తక్కువ ఎత్తులో విద్యుత్తు లైన్లు

ఫిర్యాదు చేసినా తొలగించని వైనం

ఈనాడు, హైదరాబాద్‌; రాంనగర్‌, గౌతంనగర్‌, కుత్బుల్లాపూర్‌, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు నగరంలో రహదారి ప్రమాదాల్లోనే ప్రాణాలు ప్రజలు కోల్పోతున్నారు. ఇప్పుడు విద్యుత్తు సంస్థ నిర్లక్ష్యంతో రహదారిపై తీగలూ ప్రాణాలు తీస్తున్నాయి. విద్యుత్తు పంపిణీ సంస్థ లైన్ల ద్వారా కరెంట్‌ సరఫరా చేయడమే కాదు సురక్షితంగా నిర్వహించడమూ వారి బాధ్యతే. అత్యవసర సేవల పేరుతో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా.. రోడ్‌ కాంగ్రెస్‌ నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ఎత్తులో ఇష్టారీతిగా రైట్‌ ఆఫ్‌ వే తీసుకుంటూ లైన్లను వేసిన ఫలితంగా తరచూ విద్యుత్తు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తూ ఎక్కడైనా తీగలు తెగిపడితే లైన్లు ట్రిప్పయి సరఫరా ఆగిపోవాలి. కానీ బ్రేకర్లు పనిచేయక కరెంట్‌ తీగ తెగి పడినా విద్యుత్తు ప్రసరిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి భోలక్‌పూర్‌లో డీసీఎం వ్యాను తాకి కరెంట్‌ తీగలు తెగిపడటంతో అదే రహదారిలో వెనుక వస్తున్న బాలుడిపై పడటంతో అక్కడిక్కడే చనిపోయాడు. ఇలాంటి ప్రమాదాలు తరచూ సిటీలో జరుగుతున్నా డిస్కం తమకేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. డీఈ నుంచి ఎస్‌ఈ, సీజీఎం, డైరెక్టర్ల వరకు పెద్ద వ్యవస్థ ఉన్నా ప్రమాద ఘటనల అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించిన దాఖలాలే లేవు. కింది స్థాయి సిబ్బందికే పనులను పురమాయించి చేతులు దులుపుకొంటున్నారు.


* హెచ్‌ఎంటీ కాలనీలో 1967లో ఏర్పాటు చేసిన సుమారు 42 సిమెంటు విద్యుత్తు స్తంభాలకు పెచ్చులూడిపోయి ఇనుప చువ్వలు తేలాయి. బలంగా గాలివీస్తే అవి కూలిపోయే పరిస్థితి. నాలుగేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో 33 కేవీ విద్యుత్తు తీగ తెగి కింద పడటంతో అక్కడే ఆడుకుంటున్న ఓ బధిర బాలుడు దుర్మరణం చెందాడు.


* మల్కాజిగిరి సర్కిల్‌ గౌతంనగర్‌ డివిజన్‌ పరిధిలోని మల్లికార్జున్‌నగర్‌ పదో నంబరు వీధిలో విద్యుత్తు స్తంభం రోడ్డు మధ్యలో ప్రమాదకరంగా మారింది. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు గత నాలుగు విడతల పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారులకు విన్నవించినా ఫలితం లేదు.


గ్రేటర్‌లోని పది సర్కిళ్ల పరిధిలో విస్తృతమైన విద్యుత్తు నెట్‌వర్క్‌ ఉంది. ఎల్‌టీ, 11కేవీ, 33కేవీ లైన్ల వరకు విద్యుత్తు పంపిణీ సంస్థ నిర్వహిస్తోంది. ప్రతి లైను విద్యుత్తు సంస్థ వేసినదే. కానీ కనీస ప్రమాణాలు పాటించడం లేదు. దీంతో రహదారి మధ్యలో, ఖాళీ స్థలం ఉంటే యాజమాని అక్కడ లేడని ఫ్లాట్‌ మధ్యలో లైన్లు వేస్తున్నారు. ఇటీవల ఎత్తైన స్తంభాలు వేస్తున్నారు కానీ గతంలో తక్కువ ఎత్తులో వేసిన స్తంభాలు, వాటి నుంచి వెళ్తున్న తీగలు వాహనాలకు తాకి తెగిపడుతున్నాయి. వీటిని పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించాల్సి ఉండగా స్థానికులు ఫిర్యాదులు చేసినా నిధులు లేవని పట్టించుకోవడం లేదు. ఇటీవలె పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తైంది. ఇందులో ఒకరోజు పవర్‌ డేగా నిర్వహిస్తున్నారు. దీన్ని సైతం మొక్కుబడిగా మార్చేశారు.

గతంలో ఘటనలు..

ఏడాది క్రితం ఉప్పరపల్లి నుంచి హైదర్‌గూడ వెళ్లే రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని టిప్పర్‌ ఢీకొనడంతో తీగలు తెగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు. ఈ తరహా రహదారి మధ్యలో నగరంలో చాలా ప్రాంతాల్లో ఎల్‌టీ, 11కేవీ లైన్లు ప్రమాదకరంగా ఉన్నాయి.

రాంనగర్‌లో రెడ్‌కాన్వెంట్‌ ప్రాంతంలో నెల రోజుల క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మంటలు వచ్చాయి. వేసవిలో ఓవర్‌ లోడ్‌తో విద్యుత్తు తీగ తెగి పడింది. అయినా లైన్‌ ట్రిప్‌ కాలేదు. రోజంతా తెగి పడిన తీగల్‌లో కరెంట్‌ పాసైంది. అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏఈ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రమాదం జరగకుండా నివరించగల్గారు.

గతంలో కోదండరెడ్డినగర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద చెట్ల కొమ్మలు విరిగి కరెంట్‌ స్తంభాలపై పడటం.. లైన్లు ట్రిప్పుకాకపోవడంతో చుట్టుపక్కల 400 ఇళ్లలో విద్యుత్తు ఉపకరణాలు కాలిపోయాయి.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని