logo

తల్లి పేగుకు.. ముళ్లపోగు

తండ్రి కసాయితనానికి గాయాలపాలైన చిట్టితల్లి కన్నుమూసింది. కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చింది.  కన్న బిడ్డ మరణం.. కట్టుకున్నోడు జైలు పాలవటంతో ఎటూ పాలుపోని ఆ మాతృమూర్తి విలపిస్తోంది. నిండు గర్భిణి అయిన

Published : 10 Aug 2022 02:47 IST

కన్నబిడ్డ కన్నుమూత.. భర్త జైలుపాలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: తండ్రి కసాయితనానికి గాయాలపాలైన చిట్టితల్లి కన్నుమూసింది. కన్నతల్లికి పుట్టెడు శోకం మిగిల్చింది.  కన్న బిడ్డ మరణం.. కట్టుకున్నోడు జైలు పాలవటంతో ఎటూ పాలుపోని ఆ మాతృమూర్తి విలపిస్తోంది. నిండు గర్భిణి అయిన ఆమె నిస్సహాయ స్థితిలో ఉండటం స్థానికులను కలిచివేస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న చిన్నారి సకీనా ఫాతిమా (3) మంగళవారం మరణించింది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే బోరబండ వాసి బాసిత్‌ అలీఖాన్‌, ఫస్ట్‌లాన్సర్‌కు చెందిన సనా ఫాతిమా ప్రేమ వివాహం చేసుకుని ఏసీగార్డ్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి నలుగురు కూతుళ్లు, ప్రస్తుతం సనా ఫాతిమా నిండు గర్భిణి. శనివారం స్నానాల గదిలో నీటితో ఆడుకుంటున్న సకినా ఫాతిమా.. వద్దని చెప్పినా వినడం లేదన్న కోపంతో తండ్రి తీవ్రంగా కొట్టడంతో పాటు పైకెత్తి నేలకేసి కొట్టాడు. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఉస్మానియాలో చేర్పించారు. తండ్రి కొట్టడంతో గాయాల పాలైన విషయాన్ని ఆసుపత్రి ద్వారా తెలుసుకున్న సైఫాబాద్‌ పోలీసులు, బాలిక తల్లి ఇచ్చిన సమాచారం మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భర్తను అరెస్టు చేస్తే పిల్లలతో తానెలా బతకాలని.. కేసు వద్దంటూ ప్రాధేయపడింది, పోలీసుల ఎదుట వాపోయింది. పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి సోమవారం న్యాయస్థానంలో హాజరుపర్చి జైలుకు తరలించారు. చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందడంతో హత్యాయత్నం కేసుని హత్యగా మార్చారు. అటు బిడ్డను కోల్పోయి, ఇటు భర్త జైలుపాలు కావడంతో సనా ఫాతిమా కన్నీరు మున్నీరవుతోంది. ముగ్గురు పిల్లలతో ఇంటిని ఎలా నెట్టుకురావాలని ఆవేదన చెందుతోంది. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం సైఫాబాద్‌ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని