logo

పనులు నత్తనడక.. తప్పదిక మునక

నగరాన్ని అక్టోబరు 2020లో వరదలు ముంచెత్తాయి. చెరువులు పొంగిపొర్లి కాలనీలు, బస్తీలు అతలాకుతలం అయ్యాయి. ఇళ్లు నీట మునిగి ప్రజలు రోజుల తరబడి నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ముంపు నివారణకు

Published : 12 Aug 2022 04:46 IST
చెరువుల వద్ద పూర్తి కాని ముంపు నివారణ చర్యలు
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, ఉప్పల్‌,మీర్‌పేట, మల్కాజిగిరి, దిల్‌సుఖ్‌నగర్‌, ఘట్‌కేసర్‌
ఉప్పల్‌ నల్ల చెరువు మధ్యలో కట్ట నిర్మించడంతో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఆక్రమణ

గరాన్ని అక్టోబరు 2020లో వరదలు ముంచెత్తాయి. చెరువులు పొంగిపొర్లి కాలనీలు, బస్తీలు అతలాకుతలం అయ్యాయి. ఇళ్లు నీట మునిగి ప్రజలు రోజుల తరబడి నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా ముంపు నివారణకు చెరువుల వద్ద ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అభివృద్ధి, వరద కాల్వ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. చెరువుల వారీగా నిధులు కేటాయించింది. రెండేళ్లు కావొస్తున్నా.. నేటికీ పనులు పూర్తి కాలేదు. భారీ వర్షాలు కురిస్తే మరోసారి ఆయా కాలనీలు, బస్తీలు నీట మునిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పనులపై ‘ఈనాడు’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. పనులు నత్తనడకన సాగుతున్నట్లు తేలింది.

గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న బాక్సు డ్రెయిన్‌

ఇదీ పరిస్థితి

* ఉప్పల్‌లో వరంగల్‌ హైవే పక్కనే సర్వే నం.155లో 120 ఎకరాల విస్తీర్ణంలో నల్ల చెరువు విస్తరించింది. సుందరీకరణ పేరుతో రూ.11 కోట్లతో తటాకం మధ్యలోంచి కట్టను నిర్మించారు. కట్ట నిర్మాణం వల్ల 56 ఎకరాల మేర కబ్జాకు గురైంది. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కబ్జాదారులకే వంత పాడుతున్నారు.

* మీర్‌పేటలో మూడు చెరువుల నుంచి వచ్చే వరదనీరు సాఫీగా వెళ్లేందుకు రూ.18.19 కోట్లతో పనులు చేపట్టారు. పెద్ద చెరువు, మంత్రాల చెరువు, చందన చెరువుల చుట్టు పక్కల కాలనీల్లో చేపట్టిన నాలాల నిర్మాణం ముందుకు సాగడం లేదు. కనీసం 50 శాతం పనులైనా పూర్తి కాలేదు.

* నేరేడ్‌మెట్‌ డివిజన్‌ రామకృష్ణాపురం చెరువును రూ.10 కోట్లతో మూడేళ్ల కిందట అభివృద్ధి చేయాలని నిర్ణయించినా.. నేటికీ పూర్తి కాలేదు. నీరు నిలిచే పరిస్థితి లేక నాలాల నుంచి సఫిల్‌గూడ చెరువుకు చేరుకుంటోంది. ఎప్పటికప్పుడు బండచెరువులోకి వదిలేస్తుండటంతో కాలనీలు మునిగిపోతున్నాయి.

* రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు గగన్‌పహాడ్‌లోని అప్పా చెరువు కట్ట తెగి ఆరుగురు చనిపోయారు. వెంటనే రూ.22 లక్షలతో కట్ట వెడల్పు చేపట్టారు. నాణ్యత కొరవడి గతేడాది కట్ట కింద ప్రాంతంలో లీకేజీ ఏర్పడి బెంగళూరు హైవేను వరదనీరు ముంచెత్తింది. రూ.8 కోట్లతో చేపట్టిన వరదకాల్వ ఇంకా పూర్తి కాలేదు.

* జల్‌పల్లిలోని బురాన్‌ఖాన్‌ చెరువు వరదనీరు గుర్రం చెరువులోకి పారేందుకు రూ.10 కోట్లతో నిర్మిస్తున్న కాల్వ పనులు కొనసాగుతున్నాయి.

* ఘట్‌కేసర్‌, ఎదులాబాద్‌ మధ్య చిట్టెం చెరువు కట్ట గతేడాది భారీ వర్షాలకు తెగింది. ప్రస్తుత భారీ వర్షాలకు కట్టపై పెద్ద గుంతలు పడి ఆధ్వానంగా మారింది.

* జీడిమెట్లలోని ఫాక్స్‌సాగర్‌లోకి నీరు కలవకుండా చేపట్టిన బాక్స్‌ డ్రెయిన్‌ పూర్తి కాలేదు.

* సరూర్‌నగర్‌ చెరువుకు గ్రీన్‌పార్కు కాలనీ వద్ద మట్టికట్ట వేయడంతో కొంతమేర ఉపశమనం కలిగింది. రూ.3 కోట్లతో సింగరేణి కాలనీలో నిర్మిస్తున్న బాక్సు డ్రెయిన్‌ పనులు పూర్తి కాలేదు. సుందరీకరణ పనులు నిలిచిపోయాయి.

గ్రేటర్‌లో చెరువులు 185

శివారు మున్సిపాలిటీల్లో తటాకాలు 110

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని