logo

ప్రైవేటులో కష్టమన్నారు.. నిమ్స్‌లో ప్రాణం పోశారు

ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించగా బతకడం కష్టమని చెప్పిన ఓ బాలికకు నిమ్స్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.

Published : 29 Jan 2023 02:35 IST

బైపాస్‌ లేకుండా వాల్వు మార్పిడి, గుండె రంధ్రానికి చికిత్స

జాహ్నవితో మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ,
హృద్రోగ నిపుణులు సాయి సతీష్‌, నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ బీరప్ప తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించగా బతకడం కష్టమని చెప్పిన ఓ బాలికకు నిమ్స్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. శనివారం నిమ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిమ్మ సత్యనారాయణ, కార్డియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సాయి సతీష్‌ వివరాలు వెల్లడించారు. జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన రాంబాబు, సుజాత దంపతుల కుమార్తె జాహ్నవికి పుట్టుకతోనే గుండెపై భాగంలో రంధ్రం(ఏఎస్‌డీ)తోపాటు గుండె నుంచి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల వద్ద వాల్వు కూడా దెబ్బతింది. 3 ఏళ్ల వయసులో ఆమెకు వైద్యులు బైపాస్‌ సర్జరీ చేసి సరిచేశారు. ప్రస్తుతం 16 ఏళ్ల బాలిక నాలుగేళ్లుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతోంది. తల్లిదండ్రులు పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో సంప్రదించగా చాలా క్లిష్టమైన సమస్య అని.. రూ.40 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అయినా హామీ ఇవ్వలేమన్నారని సదరు వైద్యులు తల్లిదండ్రులకు వివరించడంతో వారు యువతిని నిమ్స్‌లో చేర్పించారు. రంగంలోకి దిగిన డాక్టర్‌ సాయి సతీష్‌ ఇతర వైద్య బృందం వివిధ రకాల పరీక్షల చేసి యువతి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. కాలి నరం నుంచి క్యాథిటర్‌ ద్వారా ఏఎస్‌డీ పరికరంతోపాటు కృత్రిమ వాల్వు పరికరం పంపి.. రెండు సమస్యలకు ఒకేసారి చికిత్స చేశామని వైద్యులు వివరించారు. నిమ్స్‌ చరిత్రలోనే ఈ తరహా శస్త్రచికిత్స చేయడం ఇదే తొలిసారని డా.సాయి సతీష్‌ వివరించారు. యువతి పూర్తిగా కోలుకుందని రెండు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామన్నారు. ఇందుకు రూ.14 లక్షల వరకు ఖర్చు అయిందని యవతి తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో పూర్తి బీమా కింద చికిత్స అందినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని