logo

శాస్త్రీయ సంగీత, సాహిత్య రంగాల్లో యువత రాణించాలి: త్రివిక్రమ్‌

మానవ జీవితంలో సమస్యలు సహజమని, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనో నిబ్బరంతో అధిగమించడం ముఖ్యమని  ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 19 Mar 2023 22:55 IST

హైదరాబాద్‌: మానవ జీవితంలో సమస్యలు సహజమని, ఇబ్బందులు ఎదురైనప్పుడు మనో నిబ్బరంతో అధిగమించడం ముఖ్యమని  ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అభిప్రాయపడ్డారు.  లక్ష్య సాధనలో సమస్యల్ని దాటుకుని విజయ తీరాలకు చేరాలని ఆయన అభిలాషించారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి, నాట్య గురువు సౌజన్య శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ‘దొరకునా ఇటువంటి సేవ’ పేరుతో నాట్య కదంబం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సౌజన్య శ్రీనివాస్‌ వద్ద కొన్నేళ్లుగా శిక్షణ పొందిన శిష్టా వైష్ణవి చక్కటి నృత్య రీతులను అభినయించి ఆకట్టుకున్నారు. లా స్టూడెంట్‌ వైష్ణవి నాట్యంలో చక్కటి ప్రావీణ్యం సంపాదించారని పలువురు కొనియాడారు. 

కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ నాట్య గురువు పసుమర్తి రామలింగశాస్త్రి, తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, ఎన్‌ఐజీఎల్‌ ఆసుపత్రి డైరెక్టర్‌ ఆర్‌.వి.రాఘవేంద్రరావు సమక్షంలో నాట్య కదంబం జరిగింది. పుష్పాంజలి, గిరిరాజసుత, ఎందరో మహానుభావులు నృత్య రీతులను వైష్ణవి అభినయించారు. నాట్య గురువు సౌజన్య శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో శాస్త్రీయ సంగీత నృత్య రీతులు పరవళ్లు తొక్కాయి. కార్యక్రమం చివరిలో ప్రదర్శించిన తిలాన నాట్య ప్రదర్శనకు ఆహూతులు జేజేలు పలికారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సౌజన్య శ్రీనివాస్ దంపతులకు గురుపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా యువ కళాకారిణి వైష్ణవిని త్రివిక్రమ్‌ అభినందించారు. ఈ కాలం యువత అనేక అంశాల్లో రాణిస్తున్న తీరు ముచ్చట కలిగిస్తోందన్నారు. వివిధ రంగాల్లో భారతీయ యువత అగ్రస్థానంలో నిలుస్తోందని ఉదహరించారు. శాస్త్రీయ సంగీత, సాహిత్య రంగాల్లో మన యువత రాణించాలని సూచించారు. నాట్య గురువుగా తన భార్య సౌజన్య శ్రీనివాస్ అగ్రస్థానంలో పురోగమించాలని అభిలాషించారు. నాట్య కదంబం నిర్వాహకులను త్రివిక్రమ్ శ్రీనివాస్ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని