logo

మహానగరంలో మత్తు కల్లోలం

యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను కట్టడి చేస్తే చాలని భావించిన నగర పోలీసులకు వీధివీధినా దొరికే మత్తుమాత్రలు సవాల్‌గా మారాయి. మత్తు కల్లోలంలో లక్షలాది మంది చిక్కుకోవటం ఆందోళన కలిగిస్తోంది.

Updated : 01 Apr 2023 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌

హెచ్‌న్యూ పోలీసులు స్వాధీనం చేసుకున్న దగ్గుమందు, మత్తు మాత్రలు (పాత చిత్రం)

యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదకద్రవ్యాలను కట్టడి చేస్తే చాలని భావించిన నగర పోలీసులకు వీధివీధినా దొరికే మత్తుమాత్రలు సవాల్‌గా మారాయి. మత్తు కల్లోలంలో లక్షలాది మంది చిక్కుకోవటం ఆందోళన కలిగిస్తోంది. మానసిక ఆందోళన, దగ్గు, ఆస్తమా, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యల నివారణకు వాడాల్సిన మందులు చీటీ లేకుండానే పలు మందుల దుకాణాల్లో విక్రయిస్తున్నారు. అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆసిఫ్‌నగర్‌లోని ఒక మందుల దుకాణంలో రెండేళ్ల వ్యవధిలో 48 లక్షలు,  అంబర్‌పేట్‌లోని మరో దుకాణంలో 56లక్షలు అల్ఫాజోలం.50 మాత్రలు విక్రయించారు. వీటిలో కేవలం 1-2శాతం మాత్రమే మానసిక సమస్యలతో బాధపడేవారికి చేరగా.. మిగతావన్ని విద్యార్థులు, యువకులు కొనుగోలు చేసినట్టు అంచనా. ఇవన్నీ సంబంధిత మందుల దుకాణదారులు రికార్డుల్లో లభించిన సమాచారం. అక్రమంగా ఇంకెన్ని రెట్లు అల్ఫాజోలం, డైజోఫాం, ట్రైకా వంటి మాత్రలు విక్రయించారనేది పోలీసులు, వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

పాఠశాల స్థాయి నుంచే..

పాఠశాల స్థాయిలోనే లక్షలాది మంది విద్యార్థులు సహా దగ్గుమందు కొడిన్‌ ఫాస్పెట్‌, అల్ఫాజోలం మాత్రలకు బానిసలుగా మారినట్లు పోలీసులు గుర్తించారు.

లాభాలు కురిపించే మాత్రలు

మహానగరంలో 45,000లకు పైగా మందుల దుకాణాలున్నట్టు అంచనా. వాటిలో 20-30శాతం దుకాణాలు లాభాలకు ఆశపడి నిషేధిత మందుల విక్రయాలు చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాజస్థాన్‌, దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఫార్మా కంపెనీలు నిబంధనలు ఉల్లంఘించి దగ్గుమందు, నిద్ర, నొప్పుల మాత్రలు తయారు చేస్తున్నాయి. వాటిని రికార్డుల్లో చూపకుండా మందుల దుకాణాలకు చేరవేస్తున్నాయి. 17-20 పైసలు విలువైన ఒక్కో మాత్ర దుకాణానికి చేరే సరికి రూ.1-2కు  చేరుతోంది. అదే మాత్ర నల్లబజారులో రూ.12-17 వరకూ కొంటున్నారని దర్యాప్తులో గుర్తించారు. మందుల దుకాణాలపై వైద్య యంత్రాంగం అడపాదడపా దాడులు చేస్తోంది. ఏటా 100-120 దుకాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం హెచ్‌న్యూ తనిఖీల్లో గుర్తించిన 15 దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేసినట్టు తెలిసింది. డీలర్లతో సంబంధాలున్న మరో 10 దుకాణాలకు నోటీసులు జారీచేసినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని