logo

Malkajgiri Boy Kidnap Case: మత్తు ఇద్దాం.. జ్ఞాపకం చెరిపేద్దాం

మల్కాజిగిరిలో బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితుల వ్యూహం పోలీసులను కంగు తినిపించింది. 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి.

Updated : 19 Jun 2023 09:27 IST

మల్కాజిగిరి బాలుడి కిడ్నాప్‌ వెనక నిందితుల వ్యూహం
తమను గుర్తు పట్టకుండా పిల్లాడికి ఆపరేషన్‌ చేయాలని పథకం

ఈనాడు, హైదరాబాద్‌: మల్కాజిగిరిలో బాలుడి కిడ్నాప్‌ కేసులో నిందితుల వ్యూహం పోలీసులను కంగు తినిపించింది. 14 ఏళ్ల బాలుడి కిడ్నాప్‌ వ్యవహారంలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. పిల్లాడిని కిడ్నాప్‌ చేసి, డబ్బు వచ్చాక జ్ఞాపకాలు చెరిపేసి.. పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి పోలీసులు బాలుడి అపహరణ కేసు సవాల్‌గా తీసుకొని ఛేదించడంతో నిందితుల వ్యూహం బెడిసికొట్టింది.

పోలీసులకు చిక్కిన ప్రధాన నిందితుడు.. ఈ కేసులో ప్రధాన సూత్రధారి సుంకేశుల శివ ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు చిక్కినట్లు సమాచారం. కడపకు పారిపోగా.. ఇతర నిందితులు ఇచ్చిన సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శివ స్వస్థలం అన్నమయ్య జిల్లా రాజంపేట. కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా నగరానికి వచ్చి మౌలాలిలో స్థిరపడ్డారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో నష్టపోవడంతో సుంకేశుల రవి, మహిపాల్‌, దిలీప్‌, మైనర్‌ బాలుడితో కలిసి కిడ్నాప్‌ పథకం వేశాడు. ఇంటి పక్కనే ఉండే బిల్డర్‌ రూపినేని శ్రీనివాస్‌ చిన్న కుమారుడు హర్షవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారు. నిందితులు కారులో బాలుడిని 15, 16 తేదీల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో తిప్పారు. మిగతా కుట్రను కడప నుంచి అమలు చేసేందుకు 16వ తేదీ ఉదయం శివ కడపకు వెళ్లాడు. కడపకు చేరుకున్న శివ బాలుడి తండ్రి రూ.2 కోట్లు ఇవ్వగానే అందర్నీ కడపకు రమ్మని సూచించాడు. అక్కడ తనకు తెలిసిన వారి ద్వారా బాలుడికి మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స ద్వారా అతని గత జ్ఞాపకాలు చేరిపేయాలని భావించాడు. బాలుడికి తాము ముందే పరిచయం ఉండటంతో తల్లితండ్రులకు అప్పగించాక తమ గురించి చెబుతాడని ఈ ఆలోచన చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించినట్లు తెలిసింది. 

* ఈ వ్యవహారంలో మైనర్‌ పాత్ర విస్తుగొలుపుతోంది. బాలుడిని తమ కారులోకి ఎక్కిస్తే చాలని.. కావాల్సిన డబ్బు ఇస్తామని చెప్పారు. విషయం ఇతరులెవరికీ చెప్పకుండా రూ.20 వేలు చేతి ఖర్చుల కోసం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని