logo

కేడర్‌ను నిలబెట్టి.. విజయం చేపట్టి

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పార్టీ ఎంపికచేసింది. ఆయన నియోజక వర్గంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 12వేలపై చిలుకు అధిక్యంతో విజయాన్ని సాధించారు.

Published : 08 Dec 2023 02:06 IST

నిత్యం ప్రజల్లోనే కొనసాగిన ప్రసాద్‌కుమార్‌
న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌ను పార్టీ ఎంపికచేసింది. ఆయన నియోజక వర్గంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 12వేలపై చిలుకు అధిక్యంతో విజయాన్ని సాధించారు. 2014, 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఎలాంటి కుంగుబాటుకు లోను కాకుండా నియోజక వర్గ క్షేత్ర స్థాయి నాయకులకు అండగా నిలిచారు.

జనం మధ్యే.. 9 సంవత్సరాలు  

గెలిచినా, ఓడినా ప్రసాద్‌కుమార్‌ సాధారణ నాయకుడి మాదిరిగానే ప్రజల మధ్యనే ఉంటూ వచ్చారు. ప్రతి మండలం, గ్రామంలో తరచూ పర్యటిస్తూ నాయకులను, కార్యకర్తలను తరచుగా కలుస్తూ అండగా నిలిచారు.  ఎక్కడా నిరాశకు గురి కాకుండా 9 సంవత్సరాలుగా వికారాబాద్‌ నియోజక వర్గ ప్రజలతోనే ఉన్నారు. ‘ప్రజల వద్దకు ప్రసాదన్న’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామ గ్రామాన పర్యటించారు. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు.

ఇంటింటికీ చేరిన మ్యానిఫెస్టో  

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ‘ఆరు గ్యారంటీ’ పథకాలను ఆయన ప్రజలకు చేర్చడంలో విశేష కృషి చేశారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యులను, మహిళలకు కలిసి కాంగ్రెస్‌ పార్టీ హామీలను వివరించారు. ఎక్కడా కూడా నాయకులను, కార్యకర్తలను విస్మరించలేదు. దీంతో గ్రామ, మండల స్థాయిలో వారు ఆయన విజయానికి వంద శాతం కృషి చేశారు.

భారాస నుంచి కాంగ్రెస్‌ వైపు

వికారాబాద్‌ పురపాలక సంఘం అధ్యక్షురాలు మంజుల, ఆమె భర్త రమేశ్‌కుమార్‌ అనుచరులతో భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆమె నవంబర్‌ చివరి వారంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరే కాకుండా మర్పల్లి ప్రాంతాల్లో మంచి పట్టు ఉన్న మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వికారాబాద్‌ మాజీ మార్కెట్‌ కమటీ ఛైర్మన్‌ రాంచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తార్‌శరీఫ్‌, ధారూర్‌ మండలం ప్రముఖ నాయకుడు హన్మంత్‌రెడ్డి తదితరులు భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు కొత్తగా పార్టీలో చేరిన నాయకులు ప్రసాద్‌కుమార్‌ విజయానికి కష్టపడ్డారు. ఇదే కాకుండా భారాస ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కూడా కలిసి వచ్చింది.  

సమస్యలపై అధికారుల నిలదీత

భారాస ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రసాద్‌కుమార్‌ ప్రజల మధ్యన ఉంటూ ఎండగట్టారు. ధరణి సమస్యలపై ఆయన అధికారులను నిలదీశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.


తగిన న్యాయం చేస్తారు

-అనన్య, చేతన్‌ (ప్రసాద్‌కుమార్‌ కుమార్తె, అల్లుడు)

శాసన సభ స్పీకర్‌ పదవి గౌరవ ప్రదమైంది. దీనికి ఆయన తగిన న్యాయం చేసి అందరినీ మెప్పించే విధంగా నడుచుకుంటారు. గతంలో మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేశారు. ఆ అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని