logo

Train Tickets: పెద్దపండక్కి ఊరెలా వెళ్లేది?

ఉరుకుల పరుగుల జీవితాల్లో పండగలకు అయినా కుటుంబంతో సమయం గడపాలి అని అనుకుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సరిహద్దులు దాటి వెళ్లిన వారు పండగలకు స్వగ్రామాలకు చేరుకుంటారు.

Updated : 24 Dec 2023 08:44 IST

రైలు టిక్కెట్లు దొరకని పరిస్థితి
ప్రత్యేక రైళ్లలో ఉత్తరాంధ్ర ఊసే లేదు

ఈనాడు - హైదరాబాద్‌ : ఉరుకుల పరుగుల జీవితాల్లో పండగలకు అయినా కుటుంబంతో సమయం గడపాలి అని అనుకుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సరిహద్దులు దాటి వెళ్లిన వారు పండగలకు స్వగ్రామాలకు చేరుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రవాసులకు అతి పెద్ద పండగ అయిన సంక్రాంతికి ఊరు వెళ్లడం ఆనవాయితీ. కానీ రైలు టిక్కెట్లు (Train Tickets) అయిపోవడం, ప్రత్యేక రైళ్లు ఉత్తరాంధ్రకు లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. దీంతో ఊరు ఎలా వెళ్లాలి అన్నది వారికి అర్థం కావడం లేదు.

గంటలో నిండిపోతున్న రైళ్లు : సంక్రాంతి పండగకు (Sankranti Festival) ప్రతి ఒక్కరూ 11, 12, 13 తేదీల్లో ఎక్కువ బయలుదేరుతారు. అక్టోబరు నెల 11, 12, 13 తేదీల్లో టిక్కెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు రైల్వే కల్పించింది. రైలు టిక్కెట్లు మాత్రం కేవలం గంటలో అయిపోతున్నాయి. ఉదయం మొదలు పెడితే.. ఈస్ట్‌కోస్టు, కోనార్క్‌, ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీబ్‌రథ్‌, నాందేడ్‌ - విశాఖతో పాటు.. వారానికి 3 సార్లు నడిచే ఎక్‌ప్రెస్‌లు కొన్ని విశాఖపట్నం వరకూ మరికొన్ని ఉత్తరాంధ్ర వరకూ వెళ్తున్నాయి.  కానీ ఏ ఒక్క రైలులో టిక్కెట్‌ దొరకని పరిస్థితి. టిక్కెట్లు రిజర్వేషన్‌ వెసులుబాటు 4 నెలలకు పెంచినా ఉత్తరాంధ్ర వాళ్లకి తిప్పలు తప్పడం లేదు.

ఛార్జీల మోత తప్పదా : 20 ప్రత్యేక రైళ్లు గురువారం ప్రకటించినా ఒక్కటి కూడా విశాఖవైపు లేకపోవడంతో వారంతా నిట్టూర్చారు. ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్లతో సామాన్యులపై అధిక భారం పడుతుంది. ఉత్తరాధ్రవైపు మొత్తం 7 నుంచి 8 రైళ్లు వెళ్తుంటే.. దాదాపు 15వేల మంది ప్రయాణం చేస్తున్నారు. పండగ రోజుల్లో స్లీపర్‌ క్లాస్‌, ఏసీ బోగీల జనరల్‌ బోగీల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రయాణిస్తారు. బస్సుల్లో, సొంత వాహనాల్లో వారు 40 వేల మంది వరకూ వెళ్తారు. మరో 20 నుంచి 30 వేల మందికి టిక్కెట్‌ దొరకని పరిస్థితి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని