logo

Cyber Crime: కొండాకోనల్లో మొబైల్‌ కాల్‌ సెంటర్లు!

నిరుద్యోగం.. చాలీచాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు కొందరు ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు సైతం అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు.

Updated : 25 Dec 2023 08:48 IST

అంతర్రాష్ట్ర సైబర్‌ మాయగాళ్ల దందా
కొత్త ఎత్తులతో పోలీసులకు మస్కా

ఈనాడు, హైదరాబాద్‌:  నిరుద్యోగం.. చాలీచాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న నగరవాసులు కొందరు ఆన్‌లైన్‌లో ఉద్యోగ ప్రకటన కనిపించగానే నమ్మేస్తున్నారు. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఐటీ నిపుణులు సైతం అదనపు ఆదాయం కోసం ఆశపడుతున్నారు. ఇదే అనువుగా కేటుగాళ్లు (Cyber Crime) రెచ్చిపోతున్నారు. మారుమూల పల్లెల్లో కూర్చొని.. పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, పెట్టుబడులు, బహుమతులు, విదేశీ సంబంధాల పేరిట ఉన్నత విద్యావంతులను బురిడీ కొట్టిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. మాయగాళ్ల ఆట కట్టిస్తుండటంతో కొత్త మార్గాలు ఎంచుకుంటున్నాయి. తమ ఆనవాళ్లు బయటపడకుండా.. చాకచక్యంగా తప్పించుకుంటున్నట్లు ఇటీవల సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

కారులో చక్కర్లు.. ఫోన్‌తో గారడీలు

రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణా, పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో వందలాది సైబర్‌ ముఠాలు ఉన్నాయి. గతంలో ఈ ముఠాలు నకిలీ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేసి.. సేకరించిన డేటా ఆధారంగా ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడేవారు. సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, అంతర్జాలం ఐపీ అడ్రస్‌ ఆధారంగా పోలీసులకు తమ ఆనవాళ్లు తెలుస్తున్నాయనే ఉద్దేశంతో వాటిని మూసివేశారు. కార్లు, డీసీఎంలను కొనుగోలు చేసి వాటినే ‘మొబైల్‌ కాల్‌సెంటర్లు’గా మార్చుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేర్వేరు ప్రాంతాల్లో తిరుగుతూ ఫోన్లకు లింకులు పంపుతున్నారు. స్పందించిన వారితో కార్పొరేట్‌ సంస్థలు, కాల్‌సెంటర్ల నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించి.. అందినంత సొమ్ము ఖాతాల్లో జమ చేయించుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టినా.. వివిధ ప్రాంతాల టవర్‌ లొకేషన్‌, ఐపీ అడ్రసులు పోలీసులు అయోమయానికి గురవుతున్నారు.

టెలీగ్రామ్‌ లింకులతోనే..

ఈ ఏడాది ఇప్పటి వరకూ నగర సైబర్‌క్రైమ్‌ పోలీసులు 3000 కేసులు నమోదు చేశారు. వీటిలో అధికశాతం పార్ట్‌టైమ్‌ కొలువులు, పెట్టుబడి మోసాలు ఉన్నాయి. విద్యుత్‌బిల్లులు, కస్టమర్‌కేర్‌ కేంద్రాలు, బహుమతులు వంటివి రెండో స్థానంలో నిలిచాయి. గతంలో మొబైల్‌ ఫోన్లకు సందేశాలు పంపటం, ఫోన్‌ చేయటం ద్వారా మస్కా కొట్టేవారు. ప్రస్తుతం టెలీగ్రామ్‌ యాప్‌ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్‌ నిర్వాహకులకు నోటీసులిచ్చినా, సరైన స్పందన రావడం లేదని సమాచారం. గుర్తు తెలియని వ్యక్తుల ప్రకటనలకు స్పందించక పోవటమే ఉత్తమ మార్గమని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.

ఉదాహరణలివిగో..

టోలిచౌకిలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ జీతం ఏడాదికి రూ.20 లక్షలు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచే పని చేస్తుంది. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో పార్ట్‌టైమ్‌ జాబ్‌ లింకు క్లిక్‌ చేసింది. కేవలం గంట సమయం కేటాయిస్తే, రోజూ రూ.2000.. ఎలా చూసినా నెలకు రూ.60 వేలు పక్కా అనుకొని... రూ.12 లక్షలు పోగొట్టుకుంది.

నారాయణగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి. నిర్వాణ డిజిటల్‌ పేరుతో టెలీగ్రామ్‌ లింక్‌తో పెట్టుబడి పెడితే.. లాభాలంటూ మొదట రూ.10,000 కట్టించుకున్నారు. టాస్క్‌లు ఇస్తూ.. విజేతగా నిలిచారంటూ కొంత నగదు ఖాతాలో జమ చేసి నమ్మకం కలిగించారు. ఇంకా.. ఇంకా అంటూ రూ.5 లక్షలు కాజేసి టెలీగ్రామ్‌ ఖాతా బ్లాక్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని