logo

అన్నీ బాగుంటేనే అనుమతులు

ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Published : 24 Apr 2024 06:08 IST

ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ’(ఎఫ్‌ఎఫ్‌సీ)ల బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరేసి సభ్యులున్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 8 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో రెండు తప్ప అన్నింట ఈ బృందాలు పర్యటించాయి. ఈ నెల 23 నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు కళాశాలల్లో పర్యటించనున్నారు.

ప్రధానంగా పరిశీలించే అంశాలు...

నిబంధనల ప్రకారం యాజమాన్యాలు కళాశాలలను నిర్వహిస్తున్నాయా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి సంబంధించి అర్హులైన అధ్యాపకులు ఉన్నారా? ప్రయోగశాలల పరిస్థితి ఎలా ఉంది? వాటిలో అవసరమైనన్ని పరికరాలు ఉన్నాయా? విద్యార్థుల మార్కుల నమోదు, సమయ పాలన ఎలా ఉంది? అనే విషయం గురించి తనిఖీ చేస్తారు. అధ్యాపకుల, విద్యార్థుల హాజరు పరిశీలిస్తారు. విశ్వవిద్యాలయం నిబంధనల మేరకు తనిఖీ చేసిన అంశాలకు సంబంధించి వీడియో రికార్డు చేస్తారు. అనంతరం పూర్తి నివేదికను విశ్వవిద్యాలయానికి అందజేస్తారు.

జేఎన్‌టీయూదే నిర్ణయం

ఈ నివేదికపై జేఎన్‌టీయూ స్క్రూటినీ నిర్వహిస్తుంది. ఏవైనా చిన్నపాటి లోపాలుంటే సవరించుకునేందుకు అవకాశం ఇస్తుంది. పూర్తి స్థాయిలో వసతులు, సౌకర్యాలు, ఇతర అంశాలు పరిశీలించిన అనంతరం వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు ఇవ్వాలా? వద్దా? అనే విషయమై నిర్ణయం తీసుకుంటుంది. అన్నీ బాగున్న వాటికి మాత్రమే అఫిలియేషన్‌(అనుబంధ గుర్తింపు) ఇస్తుంది. దాని ప్రకారం ఆయా కళాశాలలు ప్రవేశాలు చేపడతాయి. కొత్త కోర్సులకు కూడా అనుమతులు తీసుకునే అవకాశం ఉంటుంది.

ఎంసెట్‌కు ముందే పూర్తి చేసేందుకు కసరత్తు... వచ్చే నెల 7 నుంచి 11 వరకు రాష్ట్రంలో ఎంసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈలోగానే తనిఖీలను పూర్తి చేసేందుకు జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది. అన్ని కళాశాలల్లో ఈనెలాఖరు నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. అనుబంధ అనుమతులు ఉన్న కళాశాలలు కొత్త కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నందున ఇంజినీరింగ్‌లో మొదటి విడత ప్రవేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి సంవత్సరం అధికారుల బృందాలు ఇలా తనిఖీలు నిర్వహిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని