logo

ప్రచార తీరు.. మారింది గురూ..!

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్‌సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు.

Updated : 24 Apr 2024 06:48 IST

ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్‌సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. ఇప్పుడు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో అడపాదడపా ర్యాలీలు, కార్యకర్తల సమావేశాలకే  అభ్యర్థులు, ముఖ్యనేతలు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధాన పట్టణాల్లో ఉదయం పూట వాకర్స్‌ను కలిసి కాసేపు ముచ్చటిస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, సామాజికవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించే బాధ్యతలను స్థానిక నాయకులు భుజానికెత్తుకుంటున్నారు.

కానరాని హంగూ ఆర్భాటాలు

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హంగూ ఆర్భాటాలు కనిపించటం లేదు. పోలింగ్‌కు సుమారు 20 రోజుల వ్యవధే ఉన్నా కనీసం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయట్లేదు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మండల నాయకులు సైతం పెద్దగా కాలు కదిపేందుకు అయిష్టత చూపుతున్నారు. ఎన్నికలపై గ్రామాలు, పట్టణాల్లో రచ్చబండ చర్చలు అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి.  

ఆచితూచి అడుగులు

గతంలో పట్టణాలకు అభ్యర్థులు, ముఖ్యనాయకులు వచ్చినప్పుడు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించి బలాన్ని ప్రదర్శించేవారు. ఇందుకోసం రోజువారీ కూలీలను రప్పించేవారు. ప్రచారం అనంతరం వారికి కూలితో పాటు భోజనం, మద్యం వంటివి పంపిణీ చేసేవారు. దీనివల్ల ఖర్చు తడిసిమోపెడయ్యేది. ర్యాలీలో ఎంతమంది పాల్గొన్నారు..? కండువాలు, టోపీలు ధరించనవారెందరు..? ద్విచక్రవాహనాలు, ఇతర వాహనాలు ఎన్ని ఉన్నాయి..? వాటి ఇంధనం ఖర్చు తదితరాలను ఎన్నికల అధికారులు లెక్కిస్తుండటంతో వ్యయ పరిమితి దాటుతుందనే భయంతో అభ్యర్థులు వీటికి ఆసక్తి కనబరచటం లేదు. కేవలం నామపత్రాల దాఖలు సమయంలో మాత్రమే పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు మొగ్గుచూపుతున్నారు.

ఓటర్లకు చేరవయ్యేందుకు..

ప్రధాన పార్టీల అభ్యర్థులు స్మార్ట్‌ ప్రచారంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు చేరవయ్యేందుకు యత్నిస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, వాయిస్‌ కాల్స్‌పై ఆధారపడుతున్నారు. ప్రముఖ దినపత్రికల్లో ఆకట్టుకునే నినాదాల ప్రకటనలతో ఓటర్ల మదిని గెలుచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని