logo

మిల్లర్లపై చర్యలకు రంగం సిద్ధం

గడువు ముగిసినా సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌)ను ప్రభుత్వానికి ఇవ్వని మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించడానికి సిద్ధమవుతోంది. వనపర్తి జిల్లా మొత్తం 139 రా మిల్లులు, 12 బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి.

Published : 16 Apr 2024 03:14 IST

జిల్లాలోని ఓ బియ్యం మిల్లులో సీఎంఆర్‌ ధాన్యం

పెబ్బేరు, న్యూస్‌టుడే : గడువు ముగిసినా సీఎంఆర్‌ (కస్టం మిల్లింగ్‌ రైస్‌)ను ప్రభుత్వానికి ఇవ్వని మిల్లర్లపై ప్రభుత్వం కొరడా ఝులిపించడానికి సిద్ధమవుతోంది. వనపర్తి జిల్లా మొత్తం 139 రా మిల్లులు, 12 బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో నాలుగేళ్లుగా ప్రభుత్వానికి సీఎంఆర్‌ బియ్యం ఇవ్వకుండా మిలర్ల యజమానులు ఏవో కారణాలు చెబుతూ సీఎంఆర్‌ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ పలుమార్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు పలు మిల్లులపై దాడులు నిర్వహించగా సుమారు 5 లక్షల ధాన్యం బస్తాలు మాయమైనట్లు తేల్చారు. జిల్లాలో 80 బియ్యం మిల్లులను డిఫాల్ట్‌ కిందకు చేర్చి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. సీఎంఆర్‌ బియ్యం ఇచ్చేందు కోసం ఎన్నో సార్లు గడువు పెంచి అవకాశాలు కల్పించినా మిల్లర్ల యజమానులు పట్టించుకోలేదు. వారిలో చలనం లేకపోవడంతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ చర్యలకు సిద్ధమవుతోంది.

ఇవ్వాల్సిన సీఎంఆర్‌ ఇలా..

వనపర్తి జిల్లాలో 2020 నుంచి నేటి వరకు సీఎంఆర్‌ ధాన్యం ఇవ్వలేదు. సీజన్‌ల వారీగా ఇలా.. 2020-21 యాసంగికి సంబంధించి సీఎంఆర్‌ బియ్యం 3,672 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలి. 2021- 22 వానాకాలం 5,064 మెట్రిక్‌ టన్నులు, అదే ఏడాది యాసంగిలో 4,722 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాల్సి ఉంది. 2022-23 వానాకాలానికి సంబంధించి 65,069 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలి. అదే ఏడాది యాసంగికి సంబంధించి హైదరాబాద్‌ పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి రాష్ట్రంలోని పలు మిల్లులకు ధాన్యం కేటాయించారు. ఈ ఏడాది వానాకాలంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని పలు మిల్లులకు 1,91,394 మెట్రిక్‌ టన్నులు కేటాయించారు. మిల్లర్లు మర ఆడించి క్వింటా ధాన్యంకు 67 శాతం బియ్యం ఇవ్వాలి. కేటాయించిన ధాన్యంలో 1,28,234 మెట్రిక్‌ టన్నులు ఇవ్వాలి. ఇప్పటి వరకు కేవలం 5,684 మెట్రిక్‌ టన్నుల బియ్యం మాత్రమే ఇచ్చారు.


ధాన్యం కేటాయించడం లేదు
- బాలు నాయక్‌, ఇన్‌ఛార్జి డీఎం,  పౌరసరఫరాల సంస్థ, వనపర్తి

జిల్లాలో గడువులోగా సీఎంఆర్‌ బియ్యం ఇవ్వని 80 బియ్యం మిల్లులను డిఫాల్ట్‌ చేశాం. వీటికి ధాన్యం కేటాయించడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు తీసుకుంటాం. నూటికి 125 శాతం వసూలు చేస్తాం. అలా ఇవ్వని వారి ఆస్తులను జప్తు చేస్తాం. డిఫాల్ట్‌ అయిన మిల్లుకు జామీను ఇచ్చిన ఇద్దరు మిల్లులపై కూడా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని