logo

నేత్రవైద్యం ఇక నిరంతరం

కొవిడ్‌ అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరి కంటి చూపు మందగించింది. ఈ నేపథ్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది.

Published : 30 Nov 2022 06:27 IST

రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి కసరత్తు


జిల్లాలో కంటి పరీక్షలు చేస్తున్న సిబ్బంది(దాచిన చిత్రం)

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: కొవిడ్‌ అనంతరం అనేక మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరి కంటి చూపు మందగించింది. ఈ నేపథ్యంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి నిరంతరం వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు వైద్యశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.

జనవరి 18 నుంచి...

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వారీగా జనాభా... ఎవరెవరికి పరీక్షలు చేయాలి తదితర వివరాలు సేకరిస్తున్నారు. నేత్ర సమస్యలతో బాధపడేవారికి పరీక్షలన్నీ చేయడానికి మూడు నుంచి ఐదు మాసాలు పట్టనుందని అంచనా వేశారు. దీనికి కావాల్సిన పరికరాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు ఎక్కువగా కంటి వ్యాధులతో బాధపడుతుంటారు. చూపు తగ్గడం, మోతిబిందుకు తప్పనిసరి శస్త్రచికిత్స చేయాల్సి ఉండటంతో పేదలకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదు. కొవిడ్‌కు ముందు చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి స్పందన లభించింది. నాలుగేళ్ల తర్వాత తిరిగి చేపడుతుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత పకడ్బందీగా..

నేత్ర సమస్యలతో బాధపడేవారికి నిరంతర వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈసారి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనున్నారు. ఆరోగ్య కేంద్రాల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. నిపుణుల కొరతను అధిగమించడానికి వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రతిఒక్కరు పరీక్ష చేయించుకునేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

నిపుణుల  కొరత తీరేనా..?

నాలుగేళ్ల క్రితం చేపట్టినప్పుడు తాత్కాలిక పద్ధతిన నేత్ర వైద్య సహాయకులను నియమించారు. వాహనాలు, పరీక్షల యంత్రాలు అద్దెకు తీసుకున్నారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో శిబిరాలు నిర్వహించారు. ప్రస్తుతం నేత్ర వైద్య సహాయకుల్లో అనేక మంది సొంత ఆస్పత్రులు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరిని సర్దుబాటు చేయడంపై సందిగ్ధం నెలకొంది.


మెరుగైన వైద్యం అందేలా..
- లక్ష్మణ్‌సింగ్‌, డీఎంహెచ్‌వో

జిల్లాలో వేలాది మంది నేత్ర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరందరికి మరోసారి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేయనున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్స నిమిత్తం సిఫారసు చేస్తాం. వచ్చే ఏడాది జనవరిలో కార్యక్రమం ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని