logo

అన్నీ.. వట్టిమాటలేనా జగన్‌!

ఒక్క అవకాశం ఇవ్వండి.. అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా. అంటూ గత ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎడాపెడా హామీలు గుప్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని నెరవేర్చలేకపోయారు.

Updated : 16 Apr 2024 05:32 IST

అమలుకు నోచుకోని పాదయాత్ర హామీలు
వెంటాడుతున్న తాగునీటి సమస్య
వీరవాసరం, నరసాపురం గ్రామీణ, భీమవరం గ్రామీణ, మొగల్తూరు, న్యూస్‌టుడే

వీరవాసరంలో సమస్య వివరిస్తున్న మహిళ (పాత చిత్రం)

ఒక్క అవకాశం ఇవ్వండి.. అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తా. అంటూ గత ఎన్నికలకు ముందు ప్రజాసంకల్ప పాదయాత్రలో ఎడాపెడా హామీలు గుప్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని నెరవేర్చలేకపోయారు. అప్పట్లో ఆయన భీమవరం, వీరవాసరం, నరసాపురం, మొగల్తూరు,  కాళ్ల, ఆకివీడు మండలాల్లో పర్యటించారు. వీరవాసరం, బొబ్బనపల్లి, మెంటేపూడి, నరసాపురం పట్టణం, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో ముత్యాలపల్లి, వారతిప్ప, శేరేపాలెం, కొత్తపాలెం, తూర్పుతాళ్లు, పీచుపాలెం, కాళ్ల మండలం సీసలి, ఆకివీడు మండలం చినకాపవరం, పెదకాపవరం, తరటావ, కోళ్లపర్రు గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సీసాలతో నీటిని తీసుకువచ్చి సమస్య పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన జగన్‌ అధికారంలోకి రాగానే డెల్టాలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. అయిదేళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధమవుతున్న వేళ జిల్లాకు వస్తున్న జగన్‌ ప్రజలకు ఏం సమాధానం చెబుతారో.

నరసాపురం 15వ వార్డు పరిధి చల్లాలమ్మ గుడి ప్రాంతంలో ట్యాంకర్ల వద్ద మహిళలు

ఇదీ పరిస్థితి

జిల్లాలో భీమవరం, నరసాపురం పట్టణాల్లో శివారు ప్రాంతాల ప్రజలకు నిత్యం తాగునీటి ఇక్కట్లు తప్పడం లేదు. శివారు ప్రాంతాలకు పైపులైన్ల విస్తరణ జరగకపోవడం, పైపులైన్లు ఉన్నా తగినంత నీరు సరఫరా కాకపోవడమే దీనికి కారణం. ఇలాంటి ప్రాంతాల వాసులకు ట్యాంకర్ల నీరే ఆధారం. పలు గ్రామాల్లో తాగునీటి చెరువులను అభివృద్ధి చేయాల్సి ఉన్నా ముందడుగు పడలేదు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన తాగునీటి పథకాలకు వైకాపా సర్కారు నిధులు నిలిపేయడంతో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ల నిర్మాణాలు నాలుగున్నరేళ్లుగా నిలిచిపోయాయి. జల్‌జీవన్‌ మిషన్‌లో సమస్య పరిష్కరించాలని భావించినా గుత్తేదారులకు సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో కొత్తగా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి.

ముత్యాలపల్లి వద్ద ఉప్పుటేరులో నీటిని తెచ్చుకుంటున్న యువకుడు


భీమవరం మండలం లోసరి పంచాయతీ తాగునీటి చెరువు ఇది. ఈ పంచాయతీ పరిధిలో గరవళ్లదిబ్బ, బర్రెవానిపేట గ్రామాలున్నాయి. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందక ఈ చెరువు గట్టున ఉన్న ఆర్వో కేంద్రం నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు దొంగపిండి, తోకతిప్ప, నాగిడిపాలెం, దెయ్యాలతిప్ప, కొత్తపూసలమూరు గ్రామాల ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జల్‌జీవన్‌ మిషన్‌లో జిల్లా వ్యాప్తంగా రూ. 424 కోట్లతో 1,473 పనులు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ. 61.13 కోట్ల విలువైన 427 పనులు పూర్తి చేశారు. ఈ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో పైపులైన్ల విస్తరణ, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు, ఫిల్టర్‌బెడ్లు, సంపుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో జలధార పథకంలో చేపట్టిన పనులను గాలికి వదిలేశారు.


మాపై ఎందుకింత కక్ష

మేం వృద్ధాప్యంలో ఉన్నాం. దూరప్రాంతం నుంచి నీటిని మోసుకు వచ్చే ఓపిక లేదు. మా ఇంటివరకు పైపులైను వేసేందుకు రెండు నెలల కిందట తవ్వారు. కానీ పైపులు వేయలేదు. వైకాపా నాయకులకు మాపై ఎందుకింత కక్షో తెలియడంలేదు.

బందన దుర్గమ్మ, బందనవారిమెరక


కొనుగోలు చేయాల్సిందే..

మా గ్రామానికి కుళాయి నీరు సక్రమంగా రావడంలేదు. పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా సమస్య పరిష్కరించడంలేదు. ఆర్వో ప్లాంట్ల నుంచి నిత్యం తాగునీటి డబ్బాలు కొనుగోలు చేసుకుంటున్నాం.

పితాని వెంకటలక్ష్మి, కట్టావారిమెరక  


అంతా అస్తవ్యస్తం

మా ప్రాంతంలో నీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తూర్పుతాళ్లులో తాగునీటి పథకం నిర్వహణ సక్రమంగా లేదు. కళాయిల ద్వారా నీరు పూర్తిస్థాయిలో అందడంలేదు.

చామకూరి సుబ్రహ్మణ్యం, తూర్పుతాళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని