logo

అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

మతిస్థిమితం సరిగా లేని ఓ యువతిపై అత్యాచారం చేసిన యువకుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 17 Apr 2024 06:18 IST

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: మతిస్థిమితం సరిగా లేని ఓ యువతిపై అత్యాచారం చేసిన యువకుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాడు మండలం పాతముప్పర్రులో ఓ యువతి అమ్మమ్మ, తాతయ్యల ఇంటి వద్దే ఉంటోంది. 2021 ఆగస్టు 25న తాతయ్య, అమ్మమ్మ ఆసుపత్రి పని నిమిత్తం విజయవాడ వెళ్లగా యువతి ఇంటి వద్ద ఉంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన సాకా శివ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె భయపడి అదే గ్రామంలోని తన అత్త ఇంటికెళ్లి  విషయం చెప్పింది. గతంలోనూ శివ నాలుగుసార్లు అత్యాచారం చేశాడని.. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని వివరించింది. ఆ యువతి అత్త పెదపాడు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జ్యోతిబసు కేసు నమోదు చేశారు. అప్పటి ఏలూరు గ్రామీణ సీఐ అనసూరి శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. 5వ అదనపు జిల్లా సెషన్స్‌, మహిళా కోర్టులో ఈ కేసు తుది విచారణ మంగళవారం చేపట్టారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీవీ రామాంజనేయులు తన వాదనలు వినిపించారు. ప్రస్తుత పెదవేగి సీఐ శ్రీనివాస్‌కుమార్‌, ఎస్సై శుభశేఖర్‌ నిందితులకు శిక్ష పడేందుకు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.  కేసు విచారించిన న్యాయమూర్తి జి.రాజేశ్వరి నిందితుడు నేరం చేసినట్లు రుజువైనందున పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతోపాటు రూ.2 వేల జరిమానా కట్టాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని