Electoral Bond : రాజకీయ పార్టీలపై కాసుల వర్షం.. ఎన్నికల బాండ్ల రూపంలో రూ.కోట్ల విరాళాలు

ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ప్రధాన రాజకీయ పార్టీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

Published : 10 Mar 2023 15:59 IST

 ఎన్నికల సంస్కరణల కోసం పని చేస్తున్న ప్రముఖ ఎన్జీవో ఏడీఆర్‌(ADR)(అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్) ఎనిమిది ప్రముఖ జాతీయ పార్టీల(national parties) ఆదాయ(income) వివరాలను బహిర్గతం చేసింది. 2021-22లో వాటికి వచ్చిన మొత్తం రూ.3289.34 కోట్లుగా ఉంది. అందులో దాదాపు 55శాతం పైగా నిధులు ఎన్నికల బాండ్ల(Electoral Bond) నుంచి సమకూరాయి. ఏమిటీ ఎన్నికల బాండ్లు?అవెలా రాజకీయ పార్టీలకు(political party) కాసులు కురిపిస్తున్నాయో ఓ సారి పరిశీలించండి.

ఏమిటీ ఎన్నికల బాండ్లు?

ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి. ఇవి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా(Fund) ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి.

ఎప్పుడు బీజం పడింది?

రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా(BJP) ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టడాన్ని ఓ ఎన్నికల సంస్కరణగా(election reform) అభివర్ణించింది. నగదు రహిత, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చామని వెల్లడించింది. 

ఎప్పుడు విక్రయిస్తారు?

ప్రస్తుతానికి ఈ బాండ్లను ఎస్‌బీఐ మాత్రమే విక్రయిస్తూ ఉంది. ఏడాదిలో నాలుగు సార్లు ఎన్నికల బాండ్లను విక్రయిస్తారు. జనవరి, ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌ నెలల్లో అవి లభ్యం అవుతాయి. వాటిని కొనుగోలు చేయడానికి 10 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణ ఎన్నికలు జరిగే సమయంలో 30 రోజుల కాల వ్యవధిని కేంద్ర ప్రభుత్వం పెంచే వీలుంటుంది. ఒకసారి జారీ అయిన ఎన్నికల బాండ్లకు 15 రోజుల కాలపరిమితి ఉంటుంది. బాండ్లు రూ.వెయ్యి, రూ.10వేలు, రూ.లక్ష, రూ.కోటి మొత్తాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి లేదా సంస్థ రూ.వెయ్యి విలువైన బాండు ఒకటైనా కొనుగోలు చేయవచ్చు.. తొమ్మిదైనా కొనుగోలు చేయొచ్చు. వారి వారి స్థాయిని బట్టి నిర్ణయించుకుంటారు. 2018 నుంచి ఈ పథకం అమలులో ఉంది. 2022 జులై నాటికి ఎస్బీఐలో కొనుగోలు చేసిన మొత్తం ఎన్నికల బాండ్ల విలువ 10వేల కోట్లు దాటింది.

బాండ్లు పొందడానికి అర్హత ఏంటి?

దేశంలో మూడు వేలకుపైగా రాజకీయ పార్టీలున్నాయి. అవన్నీ కూడా ఎన్నికల బాండ్లు పొందలేవు. ఎందుకంటే అవి కచ్చితంగా ఇటీవలి కాలంలో జరిగిన సాధారణ లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉండాలి. అందులో కనీసం 1 శాతం ఓట్లు పొంది ఉండాలి. రిప్రెజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ యాక్ట్ 1951 సెక్షన్‌ 29 ఎ ప్రకారం పార్టీ రిజిస్టర్‌ అయి ఉండాలి. అన్ని అర్హతలు కలిగిన రాజకీయ పార్టీ విరాళంగా పొందిన ఎన్నికల బాండును డిపాజిట్‌ చేస్తే.. దానికి సంబంధించిన నగదు అదే రోజు పార్టీ ఖాతాలోకి వెళుతుంది. 

ఎందుకు వివాదాస్పదం?

రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శిస్తున్నారు. వీటిని కొనుగోలు చేసి విరాళంగా ఇచ్చిన వ్యక్తుల వివరాలు కూడా బయటకు తెలియవు. దీంతో ఏ వ్యక్తి, ఏ కంపెనీ, సంస్థ... ఏ పార్టీకి ఎంత విరాళం ఇస్తున్నారో ఓటర్లకు తెలియదు. 

ఎన్నికల బాండ్ల విధానాన్ని విమర్శించడానికి రాజకీయ పరమైన కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకూ వచ్చిన ఎన్నికల బాండ్ల మొత్తాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపానే అత్యధికంగా పొందడం కూడా అందులో ఓ కారణం. 2019-20 సంవత్సరంలో జారీ అయిన ఎన్నికల బాండ్లలో మెజారిటీ శాతం భాజపా ఖాతాలోకే వెళ్లాయి. ఎన్నికల బాండ్ల జారీ ప్రభుత్వరంగ బ్యాంకు ఒక్కటి మాత్రమే చేస్తోంది. తద్వారా ప్రభుత్వంలోని పెద్దలు.. ప్రతిపక్షాలకు ఎవరెవరు? ఏయే సంస్థలు నిధులిస్తున్నాయో తెలుసుకొని వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని