Akshay Kumar: బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌కు భారతీయ పౌరసత్వం లభించింది. ట్విటర్‌ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated : 15 Aug 2023 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం (Indian Citizenship) లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ  హిందుస్థానీ. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం (Canada Citizenship) ఉందన్న విషయాన్ని అక్షయ్‌ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని అక్షయ్‌ ఇంటర్వ్యూ చేసిన సమయంలో పౌరసత్వం విషయంలో అక్షయ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. భారతీయులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అప్పట్లో కోరారు. అయితే.. ఓటు హక్కు లేని వ్యక్తి భారత పౌరులకు ఓటింగ్‌ కోసం పిలుపునివ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన అప్పట్లోనే వివరణ ఇచ్చారు. భారత్‌ పౌరసత్వాన్ని తిరిగి పొందాలని అనుకుంటున్నానని, పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు భారత పౌరసత్వం లభించింది

ఏకధాటిగా 90 నిమిషాలు.. ప్రసంగంలో మోదీ సరికొత్త రికార్డ్‌

తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్‌ కుమార్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘1990ల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లయ్‌ చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని అక్షయ్‌ వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని