Organ Donation: కుమారుడి అవయవదానానికి ముందుకొచ్చిన మాతృమూర్తి.. ఐదు ప్రాణాలకు రక్షణ

ప్రమాదంలో గాయపడి మరణం అంచుకు చేరిన ఓ యువకుడు చేసిన అవయవ దానం ఐదుగురి ప్రాణాలకు రక్షణగా నిలిచింది.

Updated : 09 Sep 2022 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదంలో గాయపడి మరణం అంచులకు చేరిన ఓ యువకుడు చేసిన అవయవ దానం ఐదుగురి ప్రాణాలకు రక్షణగా నిలిచింది. తన కుమారుడు గుండెను తీస్తే ప్రాణం పోతుందని తెలిసి కూడా బాధితుడి హృదయాన్ని, ఇతర అవయవాలను వేరొకరికి అమర్చేందుకు అంగీకరించారు ఆ మాతృమూర్తి. దీంతో తమ ప్రాణాలు నిలుపుకోవడానికి ఎదురుచూస్తున్న ఎందరో బాధితులకు ప్రాణదాతగా నిలిచాడు 20 ఏళ్ల ఛండీగడ్‌ యువకుడు. వివరాల్లోకి వెళ్తే..

ఛండీగడ్‌లోని పీజీ మెడికల్‌ కాలేజీ (PGIMER) ఆసుపత్రికి ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అతడిని బ్రెయిడ్‌ డెడ్‌గా ధ్రువీకరించారు. అయితే, ఆ సమయంలో అవయవ దానం గురించి బాధితుడి తల్లికి వైద్యులు వివరించారు. బాధితుడి నుంచి హృదయం, కాలేయం, క్లోమం (Pancreas)తోపాటు కిడ్నీల దానానికి ఆ మాతృమూర్తి అంగీకరించడంతో అందుకు కావాల్సిన ఏర్పాట్లను వైద్యులు వెంటనే చేశారు. గుండె మినహా ఇతర అవయవాలను అదే ఆస్పత్రిలోని ఇతర వారికి దానం చేయగా.. గుండెను మాత్రం దిల్లీలోని ఓ బాధితుడికి అమర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్కడకి తరలించారు.

దిల్లీలో ఆర్మీ హాస్పిటల్‌ రీసెర్చ్‌ అండ్‌ రిఫరెల్‌ (AHRR)లో ఓ 54ఏళ్ల సైనికుడు గుండె వైఫల్యంతో బాధపడుతుండగా.. ఈ యువకుడి నుంచి తీసిన గుండెను  సైనికుడికి అమర్చాలని వైద్యులు నిర్ణయించారు. ఈ విషయాన్ని నేషనల్‌ ఆర్గాన్‌ అండ్‌ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆర్గనైజేషన్‌ (NOTTO)కు తెలియజేశారు. అనంతరం ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. సైనిక బలగాల్లోని ఆర్గాన్‌ రిట్రైవల్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ అథారిటీ (AORTA), ఏహెచ్‌ఆర్‌ఆర్‌ వైద్యులు ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా గుండెను సకాలంలో దిల్లీకి తరలించారు. ఆ యువకుడి గుండెను 54ఏళ్ల సైనికుడికి అమర్చడంతో ద్వారా ఆయనకు కొత్త ఊపిరి పోసినట్లయింది. సెప్టెంబర్‌ 3న ఈ ప్రత్యేక ఆపరేషన్‌ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని