Chandrayaan-4: జాబిల్లి మట్టి తేవడమే లక్ష్యంగా.. చంద్రయాన్‌-4కు సిద్ధమవుతోన్న ఇస్రో!

చంద్రయాన్-3 విజయంతో ఇస్రో మరో కీలక ప్రాజెక్ట్‌ కోసం రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా జాబిల్లి మట్టి నమూనాలను భూమిపైకి తేవాలని ఇస్రో భావిస్తోంది.

Published : 19 Nov 2023 18:22 IST

పుణె: చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ క్రమంలోనే చంద్రుడిపై మరిన్ని పరిశోధనల కోసం ఇస్రో (ISRO) చంద్రయాన్‌-4 (Chandrayaan-4)/లుపెక్స్‌ (LuPEX) పేరుతో మరో కీలక ప్రాజెక్ట్‌కు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోందని ‘స్పేస్ అప్లికేషన్‌ సెంటర్’ (ISRO SAC) డైరెక్టర్‌ నీల్ దేశాయ్‌ తెలిపారు. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రయాన్‌-4 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

‘‘చంద్రయాన్‌-3 విజయం ఇచ్చిన ఆనందంతో ఇప్పుడు మేం చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ (LuPEx)ను సిద్ధం చేస్తున్నాం. చంద్రయాన్‌-3 ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంపై సుమారు 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగింది. చంద్రయాన్‌-4లో 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగుతుంది. ఇందులో 350 కేజీల బరువున్న రోవర్‌ను (చంద్రయాన్‌-3లో రోవర్‌ బరువు 30 కేజీలు) పంపనున్నాం. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగాడుతుంది. చంద్రయాన్‌-3 మిషన్ జీవిత కాలం ఒక లునార్‌ డే (భూమిపై 14 రోజులతో సమానం) కాగా, చంద్రయాన్‌-4.. ఏడు లునార్‌ డే (భూమిపై సుమారు వంద రోజులు)లపాటు పనిచేస్తుంది. ఈ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం రెండు లాంచ్‌ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది’’ అని నీల్‌ దేశాయ్‌ వెల్లడించారు. 

చంద్రయాన్‌-3 విజయం తర్వాత మరింత పెద్ద సవాల్‌కు సిద్ధం కావాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారని నీల్‌ దేశాల్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్‌ అంతరిక్ష సంస్థ ‘JAXA’తో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని