Varanasi: వారణాసి వీధుల్లో కారు ఆపించి.. సామాన్యుడి బహుమతి స్వీకరించిన మోదీ

ప్రధాని నరేంద్రమోదీ సోమవారం సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాశీ విశ్వనాథ్ నడవాను ప్రజలకు అంకింత చేయనున్నారు.

Updated : 13 Dec 2021 14:56 IST

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో కాశీ విశ్వనాథ్ నడవాను ప్రజలకు అంకితం చేయనున్నారు. కాశీ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ ఈ నడవాను నిర్మించారు. ఈ సందర్భంగా భారీ భద్రత నడుమ ప్రధాన దేవాలయానికి మోదీ కాన్వాయ్‌ వెళ్తుండగా.. ఓ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

సామాన్యుడి కానుక స్వీకరించిన మోదీ..

కాషాయ వస్త్రాల్లో ఉన్న ఓ వ్యక్తి తాను తెచ్చిన కానుకలు అందించేందుకు ప్రయత్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. మోదీ వాటిని తనకు అందించాలని వారికి చెప్పారు. అక్కడే కారు ఆపించి, ఆ వ్యక్తి తెచ్చిన తలపాగా, కాషాయ వస్త్రాన్ని స్వీకరించారు. భద్రతా వలయం లోపలికి వచ్చి ఆ వ్యక్తే స్వయంగా వాటిని మోదీకి అందించారు. దీనిపై భాజపా నేత ఒకరు స్పందిస్తూ.. ఆయన సామాన్యుడి ప్రధాని అంటూ కొనియాడారు. దానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు.

కాషాయ వస్త్రాలు ధరించి..గంగా నదిలో స్నానం

వారణాసి నగర పర్యటనలో భాగంగా యూపీ చేరుకున్న మోదీకి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. కాల భైరవ ఆలయానికి చేరుకొని ప్రధాని పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో కాశీ వీధుల వెంబడి వెళ్తున్న ఆయనపై అక్కడి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. పూలు చల్లుతూ, కరతాళ ధ్వనులు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని గంగా నదిలో స్నానమాచరించారు. కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆయన కలశంతో పుష్పాలు వదిలారు.

విశ్వనాథుడి ఆలయంలో ప్రత్యేక పూజలు..

గంగా నదిలో పుణ్యస్నానమాచరించిన అనంతరం మోదీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయటకు వచ్చిన ఆయన ప్రాంగణంలో మొక్క నాటారు.

నిర్మాణ రంగ కార్మికులపై పూలు చల్లి..

ప్రత్యేక పూజల అనంతరం ప్రధాని నిర్మాణ రంగ కార్మికులతో ముచ్చటించారు. నడవా నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. అనంతరం వారితో గ్రూప్‌ ఫొటో దిగారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి సభా వేదిక వద్దకు చేరుకున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని