Farmers: ముగిసిన సుదీర్ఘ నిరసనలు.. ఇంటికి పయనమైన రైతన్నలు

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసలు ముగిశాయి. రెండు రోజుల క్రితం చెప్పినట్టుగానే.. శనివారం ఉదయం నుంచి వారు దిల్లీ సరిహద్దులోని నిరసన వేదికల్ని ఖాళీ చేసి, ఇంటికి పయనమయ్యారు.

Published : 11 Dec 2021 12:53 IST

దిల్లీ: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపు 15 నెలల పాటు రైతన్నలు చేపట్టిన సుదీర్ఘ నిరసలు ముగిశాయి. రెండు రోజుల క్రితం చెప్పినట్టుగానే.. శనివారం ఉదయం నుంచి వారు దిల్లీ సరిహద్దులోని నిరసన వేదికల్ని ఖాళీ చేసి, ఇంటికి పయనమయ్యారు. తమ ఆందోళనలు కొనసాగించేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. వారు ఉపయోగించిన దుప్పట్లు, దిండ్లు, పీవీసీ షీట్లు, దోమ తెరలు వంటి వాటిని చుట్టుపక్కల గ్రామాల్లోని పేద ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం రంగురంగుల లైట్లతో అలంకరించిన ట్రాక్టర్లు సొంత గ్రామాలకు పయనమయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాజిపూర్ సరిహద్దు ప్రాంతంలో బయలుదేరిన ట్రాక్టర్లను రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘రేపు ఉదయం ఎనిమిది గంటలకు పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి ఉంది. ఇప్పటికే కొందరు ఇళ్లకు వెళ్లడం ప్రారంభించారు. ఈ ప్రక్రియకు 4-5 రోజులు పడుతుంది. ఈ రోజు సమావేశంలో మేమంతా మాట్లాడుకుంటాం. ప్రార్థనలు జరుపుతాం. మాకు సహకరించిన వారిని కలుస్తాం. నేను ఈ 15వ తేదీన ఈ ప్రాంతాన్ని వీడతాను. ప్రభుత్వం తన హామీలను నేరవేర్చకపోతే.. మళ్లీ తిరిగి వస్తాం’ అని టికాయిత్ వెల్లడించారు. 

గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ.. అన్నదాతలు చేపట్టిన నిరసనలకు ప్రభుత్వం దిగొచ్చింది. ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సాగు చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. అలాగే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు అంగీకరించడం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి తదితర డిమాండ్లపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటుకు ముందుకురావడంతో రైతులు నిరసన వేదికలను వీడేందుకు అంగీకరించారు. దానిలో భాగంగా వారు ఏడాది తర్వాత ఇంటికి వెళ్తున్నారు. విజయంతో తిరిగి వస్తోన్న రైతులకు ఘన స్వాగతం పలికేందుకు స్వగ్రామాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కొందరు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని