Shashi Tharoor: కాంగ్రెస్‌లోని యువ గళాన్ని వినాల్సిన సమయం ఇది!

కాంగ్రెస్‌ పార్టీలోని యువ గళాన్ని వినాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ అధ్యక్ష బరిలో నిలిచిన ఎంపీ శశిథరూర్‌ అన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మార్చేందుకు నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు.

Published : 02 Oct 2022 01:26 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దాఖలైన నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఈ పదవికి సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ శశి థరూర్‌తో (Shashi Tharoor) పాటు ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామపత్రాలు సమర్పించగా.. వీరిలో త్రిపాఠి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో ఇక ఖర్గే, థరూర్‌ మధ్యే పోటీ నెలకొంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లోని యువ గళాన్ని వినాల్సిన సమయం వచ్చిందని శశి థరూర్‌ వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. యువ కార్యకర్తల గళం తప్పక వినాల్సిఉందని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మార్చేందుకు నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. 23 మంది పార్టీ అసమ్మతి నేతల ప్రధాన డిమాండ్‌ను సైతం వింటామన్నారు. సీనియర్లను గౌరవిస్తామని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి దాఖలైన దరఖాస్తులను కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం పరిశీలించింది. ఖర్గే, థరూర్‌, త్రిపాఠి మొత్తం 20 నామినేషన్‌ సెట్లను సమర్పించగా.. ఇందులో ఖర్గే 14, థరూర్‌ 5, త్రిపాఠి ఒక నామినేషన్‌ వేశారు. అయితే, సంతకాల్లో లోపాల కారణంగా నాలుగు పత్రాలను తిరస్కరించినట్లు పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ వెల్లడించారు. ఇందులో ఒకటి త్రిపాఠి వేసిన నామినేషన్‌ కూడా ఉంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలిగినట్లయింది. ప్రస్తుతం పోటీలో ఖర్గే, థరూర్‌ ఇద్దరే ఉన్నారని పార్టీ ఎన్నికల సంఘం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని