OMG 2: ‘ఓ మైగాడ్2’.. అక్షయ్‌ పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

అక్షయ్‌ కుమార్ (Akshay Kumar) నటించిన తాజా చిత్రం ‘ఓ మైగాడ్‌2’(OMG 2). ఈ సినిమా కోసం ఆయన భారీగా రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే వార్తలపై నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

Published : 18 Aug 2023 20:00 IST

ముంబయి: వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ‘ఓ మైగాడ్‌2’ (OMG 2). అమిత్‌ రాయ్‌ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే దీని కోసం అక్షయ్ కుమార్‌ భారీగా రెమ్యునరేషన్‌ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై నిర్మాతల్లో ఒకరైన అజిత్ అంధరే (Ajit Andhare) స్పందించారు. అక్షయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి అక్షయ్‌ రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన భారీగా పారితోషికం తీసుకున్నారని రాస్తున్నారు. కానీ ఆ వార్తల్లో నిజం లేదు. ‘ఓమైగాడ్2’ కోసం అక్షయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. సినిమా ముందుకు వెళ్లడానికి ఇంకా మాకే ఆర్థికంగా సాయం చేశారు. అలాగే కొన్ని అంశాల్లో సలహాలు ఇచ్చి తోడుగా నిలిచారు. ఇలాంటి సాహసోపేతమైన సినిమాలు తీయడంలో అక్షయ్‌ ఎప్పుడూ ముందుంటారు. మా స్నేహం ఇప్పటిది కాదు.. ‘ఓ మైగాడ్‌’ మొదటి భాగం వచ్చినప్పటి నుంచి మేము కలిసి సినిమాలు తీస్తున్నాం. అక్షయ్ ఎంపిక చేసుకునే స్క్రిప్ట్‌లో ఎప్పుడూ కొత్తదనం ఉంటుంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు ఆయన మాత్రమే చేయగలరు’’ అని అన్నారు. అలాగే ఈ సినిమా నిర్మాతల్లో అక్షయ్‌ కూడా ఒకరని అజిత్ అంధరే తెలిపారు. లాభాల్లో ఆయనకు షేర్‌ ఉంటుందని చెప్పారు.

‘ఆ సినిమాలోకి నన్నెందుకు తీసుకోలేదు’: ‘ఛత్రపతి’ నటి అసహనం

ఇక మరోవైపు ‘ఓమైగాడ్‌2’ మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు రూ.150కోట్లు వసూళ్లు చేసిందని చిత్రబృందం ప్రకటించింది. అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రను పోషించగా ఆయన భక్తుడిగా పంకజ్‌ త్రిపాఠి నటించారు. యామీ గౌతమ్‌ న్యాయవాది పాత్రలో కనిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని