Ashwini Sri: బిగ్‌బాస్‌ హౌస్‌లో శివాజీ పాము..: ఆసక్తికర విషయాలు పంచుకున్న అశ్విని

Ashwini Sri interview: బిగ్‌బాస్‌ సీజన్‌-7 నుంచి ఎలిమినేట్‌ అయిన అశ్విని అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Updated : 27 Nov 2023 15:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌కు ఏం ఉపయోగం’ అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అశ్విని శ్రీ (Ashwini Sri) బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘బిగ్‌బాస్‌ సీజన్‌-7’ (bigg boss telugu 7) నుంచి అశ్విని ఎలిమినేట్‌ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్స్‌లో భాగంగా తనని తాను సెల్ఫ్ నామినేట్‌ చేసుకుని, సెల్ఫ్‌గోల్ వేసుకుంది. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది.

నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు!

‘‘బిగ్‌బాస్‌ హౌస్‌కు అందరూ కప్పు గెలవడానికే వస్తారు. హౌస్‌లో నాకు ఎదురైన అనుభవాలు సరిగా లేవు. అందుకే ‘నేను బిగ్‌బాస్‌ను చూద్దామని వచ్చా’ అని అన్నాను. అంతకు ముందు వారం సేవ్‌ అయినందుకు సంతోషమే. కానీ, సరైన కారణాలు కనిపించక గతవారం సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకున్నా. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదు. పైగా మమ్మల్ని ఎప్పుడు బయటకు పంపేద్దామా?అని అనుకునేవారు. నాతో ఎవరూ మాట్లాడటం లేదని నేను వచ్చిన మొదటి వారమే నాగ్‌ సర్‌కి చెప్పా. శోభ, ప్రియాంక, అమర్‌ ఒక గ్రూప్‌ కాగా, శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ ఒక గ్రూప్‌ అయ్యారు. నైని పూజా ఒకటిగా ఆడేవారు. దీంతో నాతో (Ashwini Sri interview) మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదు. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించా’’

శివాజీ పాములాంటి వారు!

‘‘నేను ఇంకా ఎంటర్‌టైన్‌ చేద్దామనుకున్నా. మామూలుగా నేను అందరితోనూ స్నేహంగా ఉంటా. ఆరేళ్ల పిల్లాడి నుంచి 60ఏళ్ల ముసలోడి వరకూ అందరితోనూ కలిసిపోగలను. అలాంటిది హౌస్‌లో ఎవరూ మాట్లాడకపోవడంతో బాధగా అనిపించింది. (bigg boss telugu 7) నామినేషన్స్‌, గేమ్స్‌ ఆడేటప్పుడు విమెన్‌ కార్డు కావాలని వాడలేదు. హౌస్‌లో ఉన్న పరిస్థితులు అలా మాట్లాడేలా చేశాయి. ప్రతి మనిషికీ ఒక్కో రకమైన భావోద్వేగాలు ఉంటాయి. కష్టం వస్తేనే ఏడుస్తా కానీ, ఊరికే ఏడవను. చిన్న చిన్న విషయాలకు ఏడ్చి, సానుభూతి పొందాలని అనుకోలేదు. టాప్‌-5 వరకూ వెళ్తానని నమ్మకం ఉంది. అందుకే నన్ను నేను నామినేట్‌ చేసుకున్నా. హౌస్‌లో ఉన్న వాళ్లలో శివాజీ (Shivaji) పాములాంటి వారు. అందుకే హౌస్‌లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చింది. నేను ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడా చెప్పలేదు. ప్రశాంత్‌ బాగా ఆడాడని అతనికి సపోర్ట్‌ చేస్తూ మాట్లాడిన మాట వాస్తవమే అంతేకానీ, నేను (Ashwini Sri interview) ఎవరికీ భజన చేయలేదు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు భోలే షావలితో నేను బాగా కనెక్ట్‌ అయ్యా. మేము ఎవరికీ అపకారం చేసేవాళ్లం కాదు. తొందరగా కలిసిపోయే గుణం. జీవితాంతం ఆయన నాకు ఒక మంచి ఫ్రెండ్‌’’

  • హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు ఏ యానిమల్‌ అంటే..?
  • ఊసరవెల్లి: ప్రియాంక.. పైకి ఒకలా కనిపిస్తుంది. లోపల ఓవర్‌గా రియాక్ట్‌ అవుతుంది.
  • కోతి: అమర్‌. చాలా ఆరాటం. ఎవరు ఏది చెప్పినా నమ్ముతాడు.
  • పీత: రతిక.. గేమ్‌పరంగా చూసుకుంటే, తనకు రెండో అవకాశం వచ్చింది. అయినా కూడా ఆడలేదు. తను ఎదగదు.. తన పక్కన ఉన్న వాళ్లని ఎదగనీయదు.
  • గాడిద: గౌతమ్‌.. ఎంతో కష్టపడి ఆడతాడు. కానీ, అతడి టాలెంట్‌ బయటకు కనిపించదు.
  • కుక్క: అర్జున్‌.. విశ్వాసం ఎక్కువ. ఆటపరంగా నన్ను సపోర్ట్‌ చేశాడు. నమ్మకమైన స్నేహితుడు.
  • జలగ: శోభ.. పైకి బాగానే మాట్లాడుతుంది. నొప్పి తెలియకుండా నాపై ఆరోపణలు చేస్తుంది.
  • గద్ద: శివాజీ..  పరిస్థితిని బట్టి ఎలా మసలుకోవాలో బాగా తెలుసు.
  • పిల్లి: ప్రశాంత్‌ మంచివాడే. చిన్న గ్రామం నుంచి వచ్చి బాగా ఆడుతున్నాడు.
  • గొర్రె: యావర్‌.. ఆటపరంగా అతడు బెస్ట్‌ టాప్‌-5లో ఉండాలని కోరుకుంటున్నా.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని