Bhola Shankar: నేను సెట్‌లోకి వస్తున్నానంటే మెహర్‌ రమేశ్‌ వణికిపోయేవాడు: చిరంజీవి

చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కిన ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్‌ ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Published : 06 Aug 2023 17:30 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భోళా శంకర్‌’(Bhola Shankar). ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన మూవీ టీమ్‌ ‘భోళా శంకర్‌’ గురించి ఆసక్తికరమైన విశేషాలను పంచుకుంది.

తమిళంలో ‘వేదాళం’ రీమేక్‌గా దీన్ని తీర్చిదిద్దారు. దీని గురించి చిరంజీవి మాట్లాడుతూ..‘‘వేదాళం’ సినిమా ఇప్పటి వరకు ఏ ఓటీటీలోనూ విడుదల చేయలేదు. ఆ కథకు ఇక్కడి ప్రేక్షకులకు తగినట్లుగా మార్పులు చేసి ‘భోళా శంకర్‌’ను రూపొందించారు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మెహర్‌ రమేశ్‌ (Meher Ramesh) చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే నా సన్నివేశాల చిత్రీకరణ జరిగేటప్పుడు మరింత శ్రద్ధగా ఉండేవాడు. ఆయన నాకు తమ్ముడితో సమానం. నేను సెట్స్‌లోకి అడుగుపెట్టాక పూర్తిగా మారిపోతాను. చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాను. ఆ విషయం మెహర్‌కు బాగా తెలుసు. అందుకే నేను సెట్‌లోకి వస్తున్నానంటే వణికిపోయేవాడు. శీతాకాలంలోనూ చెమటలు పట్టాయి’’ అని చిరంజీవి సరదాగా చెప్పారు. 

రవితేజ వల్లే నా కల నిజమైంది.. 13 ఏళ్ల సినీప్రయాణంపై దర్శకుడి ట్వీట్‌

ఇక కీర్తి సురేశ్‌ (Keerthy Suresh) గురించి మాట్లాడుతూ..‘‘పున్నమినాగు’ సినిమాలో కీర్తి సురేశ్‌ వాళ్ల అమ్మ (మేనక)తో  కలిసి నటించాను. ఆ తర్వాత మేము కలిసినప్పుడల్లా తను కీర్తి సురేశ్‌ గురించి చెబుతుండేది. ‘మహానటి’లో కీర్తి నటన చూసి ఆశ్చర్యపోయాను. ఆ సినిమాకు నేషనల్‌ అవార్డు వచ్చినప్పుడు ఎంతో సంతోషించాను. కీర్తి ఇప్పటి వరకు ఎన్నో భిన్నమైన పాత్రల్లో నటించింది. ‘భోళా శంకర్’లో మా ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. నా చెల్లెలి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది’’ అని ప్రశంసించారు. అలాగే తమన్నా (Tamannaah) గురించి చెబుతూ తనను చూస్తే ఎంతో ముచ్చటేస్తుందన్నారు. ‘‘మిల్కీబ్యూటీ’ పాట సమయంలో తమన్నా వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది. కానీ, తమన్నా అక్కడకు వెళ్లకుండా షాట్‌ మధ్యలో ఫోన్‌లో మాట్లాడుతూ వాళ్ల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పింది. ఎంత బాధ ఉన్నా.. దాన్ని దాచుకుని డ్యాన్స్‌ చేసింది. తనకు సినిమాలంటే ఎంత ఇష్టమో చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు’’అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు