Ranveer nude shoot: పాత్ర కోసం.. పాపులారిటీ కోసం.. ఇంకా ఎవరెవరంటే?

సినిమాల్లో చొక్కా విప్పి, సిక్స్‌ ప్యాక్ చూపించటంలో ‘హీరో’యిజం ఉందనుకోవచ్చు. కమర్షియల్‌ హంగుల్లో భాగంగానే ‘హీరోయిన్లు’ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారని అభిప్రాయ పడొచ్చు.

Updated : 27 Jul 2022 11:32 IST

సినిమాల్లో చొక్కా విప్పి, సిక్స్‌ ప్యాక్ చూపించటంలో ‘హీరో’యిజం ఉందనుకోవచ్చు. కమర్షియల్‌ హంగుల్లో భాగంగానే ‘హీరోయిన్లు’ అంగాంగ ప్రదర్శన చేస్తున్నారని అభిప్రాయ పడొచ్చు. ఇంతకుమించి ముందుకెళ్లడం అంటే.. ఒంటిపై నూలుపోగు లేకుండా వారు కనిపిస్తే? ఇదే ప్రశ్న సంబంధిత నటులకు ఎదురైతే ‘పాత్ర డిమాండ్‌ మేరకు అలా కనిపించాం’ అని అంటుంటారు. ఇలా.. తమ అభిమాన నటుల్ని చూసిన కొందరు ముందుగా ‘షాక్‌’ అయినా ‘క్యారెక్టర్‌కు తగిన న్యాయం చేశారు’ అని తర్వాత సర్దుకుపోతారు. మరి, సినిమా కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం ఇలా ‘షో’ చేస్తే?

హాట్‌టాపిక్‌గా రణ్‌వీర్‌

నెట్టింట ఇటీవల హాట్‌టాపిక్‌గా మారాడు బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh). ‘విభిన్న ఫ్యాషన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటాడు కదా. ఈసారీ ఏదో కొత్త స్టైల్‌లో కనిపించుంటాడులే’ అని అనుకుంటే పొరపాటే. షర్ట్‌, ప్యాంట్‌ ఏం లేకుండా ఇలా ‘కెమెరా’కు పోజిచ్చాడు. ఓ ప్రముఖ మ్యాగజైన్‌ ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఈ స్టిల్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అంతే, దీన్ని చూసిన లక్షల మంది నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరు ‘మీమ్స్‌’ రూపంలో పంచ్‌లు విసిరారు. ‘మ్యాగజైన్ల కోసం ఒకప్పుడు చాలామంది తారలు అర్ధనగ్న ప్రదర్శనలిచ్చారు. ఈయన చేస్తే తప్పేంటి’ అని రణ్‌వీర్‌ను సమర్థించిన వారూ ఉన్నారు. ఇంకొందరు ‘ఇప్పటి వరకూ ఇలాంటి కవర్‌ షూట్‌ చూడలేదు. ది బెస్ట్‌ షూట్‌’, ‘రణ్‌వీర్‌ సాహసి’, ‘మాటల్లేవ్‌’, ‘ఇది నీకే సాధ్యం’ అంటూ ‘ఫైర్‌’ ఎమోజీలు జతచేసి రణ్‌వీర్‌ను కొనియాడారు.


విష్ణు విశాల్‌ ట్రెండ్‌

మ్యాగజైన్‌ కోసం రణ్‌వీర్‌ అలా చేస్తే తమిళ నటుడు విష్ణు విశాల్‌ (Vishnu Vishal) వ్యక్తిగతంగానే బట్టల్లేకుండా కనిపించాడు. బెడ్‌పై దిగిన ఇలాంటి కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘ట్రెండ్‌లో జాయిన్‌ అవుతున్నా’ అని పేర్కొన్నారు. ఈ స్టిల్స్‌ తీసింది ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, ఆయన సతీమణి గుత్తా జ్వాల. ఈ ఫొటోషూట్‌పైనా నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ షూట్‌పై షాకింగ్‌ ఎక్స్‌ప్రెషన్లతో కూడిన మీమ్స్‌ను కొందరు పంచుకోగా ‘ఉపయోగపడే ట్రెండ్‌ ఏదైనా ప్రారంభించండి. ఇలాంటివి ఎందుకు?’ అని మరికొందరు విమర్శించారు. 


లైగర్‌గా విజయ్‌

రణ్‌వీర్‌, విశాల్‌ కంటే ముందు న్యూడ్‌ స్టిల్‌తో నెట్టింట హల్‌చల్‌ చేసిన నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda). ‘మానసికంగా, శారీరకంగా నాకు సవాలు విసిరిన పాత్ర ఇది’ అని విజయ్‌ 
తాను హీరోగా నటించిన ‘లైగర్‌’ (Liger) సినిమాలోని ఈ లుక్‌ పంచుకున్నాడు. ఈయన ఇలా గులాబీ పువ్వుల బొకేను పట్టుకుని నగ్నంగా కనిపించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తాను ఎంపిక చేసుకున్న పాత్ర కోసం విజయ్‌ అలా నటించినా ట్రోల్స్‌ మాత్రం తప్పలేదు. కేవలం విమర్శలే కాదు అనుష్క, సమంతలాంటి ప్రముఖ తారల ప్రశంసలూ అందుకున్నాడు. దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది.


అల్లరి నరేశ్‌.. నాంది

కోర్ట్‌రూమ్‌ క్రైమ్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ‘నాంది’ (Naandhi) కోసం అల్లరి నరేశ్‌ (Allari Naresh) ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించాడు. 50కిపైగా సినిమాల్లో పక్కింటి కుర్రాడిలా ఎన్నో నవ్వులు పంచిన నరేశ్‌ను బట్టల్లేకుండా చూడటాన్ని చాలామంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ‘వాస్తవానికి దగ్గరగా ఉన్న కథ, పాత్ర కావడం వల్లే ఎంత ఇబ్బంది అయినా అలా నటించా’ అని నరేశ్‌ ఓ సందర్భంలో తెలిపారు.


అమలా అలా..

‘సిచ్యుయేషన్‌ డిమాండ్‌’ చేస్తే హీరోలే కాదు కొందరు హీరోయిన్లూ నగ్నంగా నటించే సాహసం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసి, విజయం అందుకున్న నాయికల్లో అమలా పాల్‌ (Amala Paul) ఒకరు. ఒకట్రెండు సన్నివేశాలు కాకుండా ‘ఆడై’ (Aadai) (2019) అనే చిత్రంలో ఆమె పాత్ర నగ్నంగానే ఉంటుంది. తెలుగులో ఈ సినిమా ‘ఆమె’ (Aame) పేరుతో విడుదలైంది. చూసే ప్రేక్షకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు చిత్ర బృందం తగిన జాగ్రత్తలు తీసుకుంది.


పీకే ప్రభంజనం

గ్రహాంతరవాసిగా బాలీవుడ్‌ కథానాయకుడు ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan) నటించిన చిత్రం ‘పీకే’ (PK). 2014లో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సీన్‌ కోసం ఆమిర్‌ నగ్నంగా నటించాడు. ఈ అమాయక పాత్రలో ఆయన రేడియోను అడ్డు పెట్టుకుని షాక్‌ ఇచ్చాడు. దీనికి ప్రేరణగానే సంపూర్ణేశ్‌ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ పెట్టుకున్నాడు. పాత్రలో ఒదిగిపోయేందుకు ఆమిర్‌ ఎంతటి సాహసమైనా చేస్తారని అప్పట్లో చాలామంది ప్రశంసించారు.


జైలు పాలై

నటులు నగ్నంగా నటించడమనేది దక్షిణాది చిత్ర పరిశ్రమలో అరుదు. కానీ, ఉత్తరాది చిత్ర పరిశ్రమలో పేరున్న నటులూ ఇందుకు సై అంటుంటారు. ముఖ్యంగా జైలు సన్నివేశంలో ఇది తప్పనిసరి. ఆయా పాత్రలు నేరారోపణలు ఎదుర్కోవడం, విచారణలో భాగంగా దుస్తులన్నీ తొలగించటం కామన్‌. ఈ క్రమంలోనే.. సంజయ్‌ దత్‌ జీవితాధారంగా 2018లో తెరకెక్కిన ‘సంజు’ (Sanju) చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ‘బాఘి 2’ (Baaghi 2) చిత్రం కోసం టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff), ‘న్యూయార్క్‌’ (New York) సినిమా కోసం జాన్‌ అబ్రహం (John Abraham), ‘జైల్‌’ (Jail) కోసం నీల్ నితిన్‌ ముకేశ్‌ (Neil Nitin Mukesh) నగ్నంగా నటించారు. జరిగింది జరిగినట్టు చూపించే ప్రక్రియలో భాగంగా ‘షాహిద్‌’, ‘ఒమెర్టా’ అనే బయోపిక్స్‌లో రాజ్‌కుమార్‌ రావు కొన్ని షాట్స్‌లో దుస్తుల్లేకుండా కనిపించారు.

ఈ సినిమాలు, ఈ నటులే కాదు క్రైమ్‌ థ్రిల్లర్‌, రొమాంటిక్‌ తదితర నేపథ్యాల్లో రూపొందిన చిత్రాల్లో పలువురు నటులు ఒంటిపై నూలు పోగు లేకుండా నటించారు. ఆయా పాత్రలు ‘తెర’పై అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవి. అయితే, ఒకప్పుడు సోషల్‌ మీడియా అందుబాటులో లేదు కాబట్టి సినిమా చూసిన వారికి, విన్న వారికే మాత్రమే ఫలానా వారు అలా కనిపించారని తెలిసేది. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరు. పిల్లలు, పెద్దలు, అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇలా అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి. తారలు ట్రెండ్‌ అంటూ ఏదైనా కొత్తగా ట్రై చేస్తే దాన్ని ఫాలో అయ్యేవారు లేకపోలేదు. సినిమా విషయం ఎలా ఉన్నా ‘తమ ప్రయోజనాల కోసం ఫొటోషూట్‌లో నగ్నంగా పాల్గొని, ఇలా పబ్లిక్‌లో పాపులారిటీ పొందేందుకు ప్రయత్నించడం సరికాదు’ అనేది కొందరి వాదన. ఈ క్రమంలో రణ్‌వీర్‌కు కొందరు దుస్తులు పంపి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని