Cinema: గెలుపు... కొనసాగింపు

ఓ సినిమా బంపర్‌ హిట్టు కొట్టిందంటే చాలు అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడని అడుగుతారు తెలుగు సినీజనం. ప్రేక్షకుల మనసులను, కలెక్షన్లనూ గెలుచుకున్న సినిమా అంటే ఓ సక్సెస్‌ ఫార్ములా దొరికినట్లే. అలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు కొనసాగింపు తీయడమే సీక్వెల్‌. మన దగ్గర వీటి ధోరణి తక్కువే కానీ హాలీవుడ్‌లో సంవత్సరం పొడుగునా సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీలు

Published : 14 May 2021 18:19 IST

తెలుగులో సీక్వెల్స్‌ హంగామా

ఓ సినిమా బంపర్‌ హిట్టు కొట్టిందంటే చాలు అలాంటి సినిమా మళ్లీ ఎప్పుడని అడుగుతారు తెలుగు సినీజనం. ప్రేక్షకుల మనసులను, కలెక్షన్లనూ గెలుచుకున్న సినిమా అంటే ఓ సక్సెస్‌ ఫార్ములా దొరికినట్లే. అలాంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు కొనసాగింపు తీయడమే సీక్వెల్‌. మన దగ్గర వీటి ధోరణి తక్కువే కానీ హాలీవుడ్‌లో సంవత్సరం పొడుగునా సీక్వెల్స్‌, ఫ్రాంఛైజీలు అభిమానులను పలకరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం తెలుగులోనూ వీటి హవా గణనీయంగాపెరిగింది. అరడజను సినిమాల వరకు కొనసాగింపు కథలతో సిద్ధంగా ఉన్నారు దర్శక  నిర్మాతలు. దర్శకుడు సుకుమార్‌ ‘పుష్ప’కు సీక్వెల్‌ ఉంటుందని ప్రకటించగానే ఇప్పుడు టాలీవుడ్‌ దృష్టి వాటిపై పడింది. తెలుగులో అలాంటి సినిమాలెన్ని ఉన్నాయి? వాటి ఫలితాలేంటి?

తెలుగులో వచ్చిన తొలిసీక్వెల్‌గా ‘మనీ మనీ’ గురించి చెప్పుకొంటారు. 1993లో శివనాగేశ్వర్‌రావు దర్శకత్వంలో వచ్చిన ‘మనీ’ సినిమాకు ఇదీ సీక్వెల్‌. రామ్‌గోపాల్‌వర్మనే ఈ రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. జేడీ చక్రవర్తి, పరేశ్‌ రావెల్‌, జయసుధ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించాయి. ఆ తర్వాత వీటికి కొనసాగింపుగా ‘మనీ మనీ మోర్‌ మనీ’(2011) అనే సినిమా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ అయిన ఆర్జీవీ ‘గాయం’ సినిమాకు కొనసాగింపుగా ‘గాయం 2’ వచ్చింది. ‘రక్త చరిత్ర’, సత్య, ఐస్‌క్రీమ్‌... ఇలా పలు సీక్వెల్స్‌తో పలుకరించారాయన.

 బాహుబలి.. బాక్సాఫీసు ప్రభంజనం
బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ కీర్తి పతాకాన్ని ఎగరేశారు రాజమౌళి. 2.30 గంటల్లో కథను పూర్తిగా చెప్పలేనని భావించిన జక్కన చిత్రీకరణ సమయంలోనే రెండు భాగాలుంటుందని ప్రకటించారు. అలా ‘బాహుబలి ది బిగినింగ్‌’, ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాలతో ప్రేక్షకులకు కనులపండగను అందించారు. అంతర్జాతీయంగా అభిమానులను సంపాదించుకున్నారు. రూ.2వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి ఈ రెండు చిత్రాలు.  

చిరు దాదాగిరి
చిరంజీవి హీరోగా వచ్చిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. శంకర్‌ దాదాగా మాస్‌ సినిమాల పవరేంటో చూపించారాయన. ఆ తర్వాత వచ్చిన ‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ అలరించింది. ఈ రెండు సినిమాలూ హిందీలో వచ్చిన ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగేరేహో మున్నాభాయ్‌’ సినిమాలకు రీమేక్‌గా తెరకెక్కాయి.
 గబ్బర్‌ పవర్‌కు సీక్వెల్‌
‘నాకొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది’ అంటూ అభిమానులకు థియేటర్లో పూనకాలు తెప్పించారు పవన్‌ కల్యాణ్‌ ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాతో. హరీశ్‌ శంకర్‌ దర్శకుడు. హిందీ ‘దబాంగ్‌’కు రీమేక్‌ ఇది. అప్పటివరకు ఒక్కహిట్టులేని శ్రుతిహాసన్‌ కెరియర్‌ గ్రాఫ్‌ ఈ సినిమాతోనే అమాంతం పెరిగిపోయింది. దానికి కొనసాగింపు చిత్రంగా వచ్చి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది.
   మరిన్ని..
సీక్వెల్‌ సినిమాల్లో కథ కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అల్రెడీ బాక్సాఫీస్‌ వద్ద దాని కథాబలమేంటో తెలిసిపోతుంది. అందుకే కొనసాగింపునకు మొగ్గుచూపుతుంటారు దర్శకులు. అయితే అన్నిసార్లు మనం ప్రేక్షకులను మెప్పించలేమని గతంలో కొన్ని చిత్రాలు చెబుతున్నాయి. సుకుమార్‌ ‘పుష్ప’కి కొనసాగింపుతో పాటే... మరికొన్ని సినిమాల సీక్వెల్స్‌కు పచ్చజెండా ఊపారు టాలీవుడ్‌ దర్శకనిర్మాతలు. 

*  వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ఎఫ్‌2..ఇప్పుడు నవ్వుల వ్యాక్సిన్‌తో మరింత వినోదాన్ని పంచేందుకు ‘ఎఫ్‌3’తో వస్తున్నారు అనిల్‌రావిపూడి.
*  మంచు విష్ణు, శ్రీనువైట్ల కలయికలో వచ్చిన ‘ఢీ’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘ఢీ అండ్‌ ఢీ’ని తీసుకొస్తున్నారు.
*  ‘కార్తికేయ’కు కొనసాగింపుగా ‘కార్తికేయ2’ను తెస్తున్నారు హీరో నిఖిల్‌, దర్శకుడు చందూ మొండేటి.
*  విశ్వక్‌సేన్‌ ‘హిట్‌’, అడవి శేష్‌   ‘గూఢాచారి’ సినిమాలకు సీక్వెల్స్‌సిద్ధమతున్నాయి.
* ‘సోగ్గాడే చిన్నినాయన’తో హిట్‌ కొట్టిన నాగార్జున దీనికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తీసుకురానున్నారు.
‘‘సీక్వెల్స్‌ అంటే ప్రేక్షకుల్లోనూ ముందస్తు అంచనాలుంటాయి కాబట్టి ఓపెనింగ్స్‌ వస్తాయి. ఇప్పుడు సినిమాలకు ఆరంభ కలెక్షన్లు ఎంత అవసరమో తెలుసు కదా! అందుకే నిర్మాతలు, కథానాయకులు ఇలాంటి కథలకు ఓకే చెబుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు ఓ నిర్మాత.

సుక్కు-బన్నీ.. రూ.270 కోట్లు!

సుకుమార్‌ తొలిచిత్రం ‘ఆర్య’ కుర్రకారును ఊపేసిన వెరైటీ ప్రేమకథ. వన్‌సైడ్‌ లవర్‌గా అల్లుఅర్జున్‌ చేసిన సందడి అంతాఇంతా కాదు. దానికి సీక్వెల్‌ కాకపోయినా... భిన్నమైన కథతో, అదే పేరుతో ‘ఆర్య2’ వచ్చింది. ఇదీ యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో  పాన్‌ఇండియా సినిమాగా ‘పుష్ప’ రూపొందుతోంది. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. రష్మిక కథానాయిక. ఇది సెట్స్‌ మీద ఉండగానే..దీన్ని రెండు భాగాలుగా తెరమీదకు తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనిపై దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎర్రచందనం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు పరిశ్రమే కాదు... భారతదేశంలోనే ఈ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా లేదు. తొలి నుంచి రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందనిపించేది. ఇందులో అల్లుఅర్జున్‌ మరో రేంజ్‌లో నటిస్తున్నారు. ఇంత మంచి కథని ఒక భాగానికి పరిమితం చేయడం భావ్యం కాదనిపించింది. అందుకే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.’’ అని చెప్పుకొచ్చారు. తొలిభాగాన్ని ఈ ఏడాది, రెండోదాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండుభాగాలు చిత్రీకరించేందుకు దాదాపు రూ.250కోట్ల నుంచి రూ.270కోట్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ‘‘ఇప్పటికే కొన్ని సన్నివేశాలు మినహా తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఆ మిగిలిన షూటింగ్‌ పూర్తి చేస్తామ’’ని చిత్ర బృందం చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు