Indiana Jones: సాహసాలతో సహవాసం.. ప్రమాదాలతో ప్రయాణం.. ఇండియానా జోన్స్‌..

Indiana Jones: ఇండియానా జోన్స్‌ సిరీస్‌లో వస్తున్న ఆఖరి చిత్రంగా ‘Indiana Jones and the Dial of Destiny’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సిరీస్‌ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Updated : 27 Jun 2023 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాక్షన్‌, అడ్వెంచర్‌ సినిమాలను ఆస్వాదించే వారికి ‘ఇండియానా జోన్స్‌’ (Indiana Jones) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1981లో ‘రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌’తో మొదలైన ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ నాలుగు చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్‌లో ఆఖరి చిత్రమైన ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ ఈ గురువారం (జూన్‌ 29న) ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నేపథ్యంతో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అంతే కాదండోయ్‌ అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మహేశ్‌బాబు కాంబినేషన్‌లో రాబోయే సినిమా నేపథ్యం కూడా దాదాపు ఇలాంటిదే. ‘ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు’ అని జక్కన్నే స్వయంగా చెప్పారు. మరి ఇంత క్రేజ్‌ ఉన్న ఇండియానా జోన్స్‌ ఎలా మొదలైంది? అసలు వాటి విశేషాలేంటో చూసేయండి..

  • ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌లో ఇప్పటివరకూ వచ్చిన నాలుగు చిత్రాలకు హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం వహించగా, ఇండియానా జోన్స్‌గా హారిసన్‌ ఫోర్డ్‌ నటించారు. (రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌ (1981), ఇండియానా జోన్స్‌ అండ్‌ ది టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌ (1984), ఇండియానా జోన్స్‌ అండ్‌ ది లాస్ట్‌ క్రూసేడ్‌ (1989), ఇండియానా జోన్స్‌ అండ్‌ ది కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది క్రిస్టల్‌ స్కల్‌ (2008).
  • ఈ నాలుగు చిత్రాల మొత్తం బడ్జెట్‌ 279 మిలియన్‌ డాలర్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలు ఇప్పటివరకూ 1.987 బిలియన్‌ డాలర్లను వసూలు చేశాయి.
  • ఇంతకీ ఇండియానా జోన్స్‌ పాత్ర ఎలా పురుడు పోసుకుందంటే.. 1977లో దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌, అతడి స్నేహితుడు, రచయిత లుకాస్‌లు హవాయ్‌కు విహారయాత్రకు వెళ్లారు. అప్పుడు స్పీల్‌బర్గ్‌ జేమ్స్‌బాండ్‌ కథతో సినిమా తీయాలని భావించారు. అయితే, బాండ్‌కన్నా మించిన పాయింట్‌ తన వద్ద ఉందని సాహసాలు చేసే పురాతత్వశాస్త్రవేత్త కథను లుకాస్‌ పంచుకున్నారు. ఈ కథను లుకాస్‌, ఫిలిప్‌ కాఫ్‌మెన్‌లు కలిసి డెవలప్‌ చేశారు. ఫిలిప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకున్నారు. కానీ, ఆయన వేరొక చిత్రంతో బిజీగా ఉండటంతో ఆ అవకాశం స్పీల్‌బర్గ్‌ను వరించింది.
  • అయితే, స్పీల్‌బర్గ్‌ దర్శకత్వం చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్‌ పిక్చర్స్‌ తొలుత అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన జాస్‌, క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ చిత్రాలు బడ్జెట్‌ పరిమితిని దాటిపోవడంతో ఆసక్తి చూపలేదు.
  • బడ్జెట్‌ పరిమితులు దాటకుండా ఉండేందుకు స్పీల్‌బర్గ్‌ ఓ మంచి ఐడియాను చెప్పారు. అవసరమైన చోట మినీ యేచర్‌ రూపంలో సెట్స్‌ను తీర్చిదిద్దారు. దీంతో బడ్జెట్‌ నియంత్రణలో ఉండటమే కాకుండా, చిత్ర నిర్మాణ సంస్థకు ఆయనపై నమ్మకం కలిగింది.

  • ఇక ఈ చిత్రానికి ‘ఇండియానా స్మిత్‌’ అని పేరు పెట్టాలని అనుకున్నారు. అందుకు కారణం ఇందులోని హీరో పాత్రను ‘నెవాడా స్మిత్‌’లోని స్టీవ్‌ మెక్‌క్వీన్‌ పాత్ర నుంచి స్ఫూర్తి పొంది డిజైన్‌ చేసుకున్నారు. ఇక లుకాస్‌కు ఇండియానా అనే పెంపుడు కుక్క ఉండేది. ఇలా రెండూ కలిపి ‘ఇండియానా స్మిత్‌’ అనుకున్నారు. ఇంటిపేరు సరికొత్తగా ఉంటే బాగుంటుందని స్పీల్‌బర్గ్‌ సూచన చేయడంతో ‘ఇండియానా జోన్స్‌’గా మార్చారు.
  • ఇండియానా జోన్స్‌ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై లుకాస్‌ కొంత వర్క్‌ చేశారు. ఇందుకోసం జిమ్‌ స్టెరెంకో అనే కాన్సెప్ట్‌ ఆర్టిస్ట్‌ను కూడా నియమించుకున్నారు. అమెరికన్‌ రంగస్థల నటుడు బోగి అలియాస్‌ హంఫ్రే డీఫారెస్ట్‌ బొగార్ట్‌ నటించిన ‘ట్రెజర్‌ ఆఫ్‌ ది సియారా మాడ్రే’ నుంచి స్ఫూర్తి పొంది ఇండీ పాత్రను డిజైన్‌ చేసుకున్నారు.
  • ఇక ఇండీ పాత్రలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై చాలా చర్చే జరిగింది. ‘స్టార్‌వార్స్‌’లో నటించిన హారిసన్‌ ఫోర్డ్‌తో కలిసి లుకాస్‌ అప్పటికే పని చేసి ఉన్నారు. కానీ, అతని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇండీ పాత్ర కోసం జాక్‌ నికోల్‌సన్‌, మిచెల్‌ బియాన్‌, డాన్‌ జాన్సన్‌, డేవిడ్‌ హేసెల్‌హాఫ్‌ల పేర్లను లుకాస్‌ పరిశీలించారు.
  • చివరకు వీరెవరూ కాకుండా ఇండీ పాత్ర కోసం టామ్‌ సెలెక్‌ను ఎంపిక చేశారు. అందుకోసం టెస్ట్‌ షూట్‌ కూడా చేశారు. కానీ, ‘మాగ్నమ్‌ పి.ఐ.’ టెలివిజన్‌ సిరీస్‌ కారణంగా సెలెక్‌ డేట్స్ అడ్జెస్ట్‌ చేయలేకపోయారు. దీంతో స్పీల్‌బర్గ్‌ హారిసన్‌ ఫోర్డ్‌ను ఇండీ పాత్రకు సెలక్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు. అయితే, రచయిత లుకాస్‌కు ఇది ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగింది అంతా చరిత్ర.
  • తలపై క్యాప్‌ లేకుండా ఇండీ పాత్రను ఊహించలేం. దాని వెనుక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. లండన్‌కు చెందిన కవి హెర్బర్ట్‌ జాన్సన్‌ క్యాప్‌ స్ఫూర్తిగా ఆ క్యాప్‌ను డిజైన్‌ చేసుకున్నారు. అయితే, మామూలుగా ఆ టోపీ రౌండ్‌గా ఉంటుంది. కాస్త భిన్నంగా ఉండాలని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నడూల్మన్‌ ఆ టోపీనీ మెలి తెప్పేశారు. అంతే కాదు, హారిసన్‌ఫోర్డ్‌తో కలిసి దానిపై కొద్దిసేపు కూర్చొని ప్రస్తుతం మనం సినిమాలో చూస్తున్న షేప్‌లోకి తీసుకొచ్చారు.

  • ఇక ఇందులో హీరోయిన్‌ పాత్ర పేరు మారియన్‌ రావిన్‌వుడ్‌. ఇది కూడా ఫిక్షనల్‌ క్యారెక్టరే. రచయిత లారెన్స్‌ కస్డన్‌ వాళ్ల బామ్మను మారియన్‌ అని పిలిచేవాడు. ఆ పేరే ఈ పాత్రకు పెట్టడం గమనార్హం. అమీ ఇర్వింగ్‌, జేన్‌ సేమూర్‌, డెబ్రా వింగర్‌, మ్యారీ స్టీన్‌బర్గెన్‌లు మారియన్‌ పాత్రలో నటించి మెప్పించారు.
  • ఇండీ స్నేహితుడు సల్లాహ్‌ పాత్ర కోసం డ్యానీ డీవిటోను సంప్రదించగా, ‘ట్యాక్సీ’ చిత్రీకరణలో ఉన్న అతడు డేట్స్‌ కుదరకపోవడంతో జాన్‌ రైస్‌- డేవిస్‌ను స్పీల్‌బర్గ్‌ ఎంపిక చేశారు.
  • ఇండియానా జోన్స్‌ తండ్రి పాత్రలో చేసేందుకు ఎవరైనా స్పెషల్‌ నటుడు కావాలని స్పీల్‌బర్గ్‌ అనుకున్నారు. అలా జేమ్స్‌బాండ్‌ పాత్రధారి సీన్‌ కానరీని ఎంపిక చేశారు.
  • సినిమా ఆరంభ సన్నివేశంలో ఇండీ ఒక గుహ లోపలికి వెళ్తుండగా అతడి వీపుపై పెద్ద పెద్ద సాలీడులు వేలాడుతూ ఉంటాయి. అతడితో వచ్చిన ఆల్ఫ్రెడ్‌ మోలినాస్‌పై కూడా ఉంటాయి. అవన్నీ నిజమైన సాలి పురుగులే. మొత్తం మగ పురుగులను తీసుకొచ్చి, వారి వీపుపై ఉంచడంతో అవి కదలకుండా ఉండిపోయాయి. ఆ తర్వాతి సన్నివేశం కోసం ఒక ఆడ సాలిపురుగును వాటి మధ్య విడిచి పెట్టడంతో అవి శరీరంపై పాకడం మొదలు పెడతాయి.

  • సినిమాలో ఇండీ, మారియన్‌లను విలన్స్‌ పాముల మధ్య పడేస్తారు. అక్కడ వేల సంఖ్యలో పాములు కనిపిస్తాయి. ఈ సన్నివేశం కోసం 1000కు పైగా పాములను తెప్పించారు. అన్ని తెచ్చినా స్పీల్‌బర్గ్‌ అవి సరిపోలేదేదని చెప్పడంతో లండన్‌, దాని చుట్టు పక్కల గాలించి అదనంగా మరో వెయ్యి పాములను తెప్పించారు. అప్పటికీ సరిపోలేదని చెప్పడంతో రబ్బర్‌ ముక్కలను కట్‌ చేసి, వాటికి డిజైన్‌లు వేసి పాముల మధ్య పడేశారు. ఈ సీన్‌ తీస్తుండగా, ఫస్ట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ టాంబ్లిన్‌ను ఒక కొండ చిలువ కరిచింది.
  • అదే సీన్‌లో హీరోయిన్‌ మారియన్‌ కాళ్లపై పాములు పాకుతూ కనపడతాయి. ఆ సీన్‌ చేయడానికి ఆమె భయపడిపోయింది. దీంతో ఆ సన్నివేశం కోసం పాములు పట్టే వ్యక్తి స్టీవెన్‌ ఎడ్జ్‌ను సెట్‌కు తీసుకొచ్చారు. అప్పుడు స్పీల్‌బర్గ్‌ స్టీవెన్‌ను పిలిచి ‘కాళ్లపై ఉన్న వెంట్రుకలను షేవ్‌ చేసుకుని హీరోయిన్‌ డ్రెస్‌వేసుకుని రా’ అని చెప్పారు. పాములు పాకుతుండగా స్టీవెన్‌ కాళ్లపై షాట్‌ తీసి, ముఖానికి వచ్చే సరికి హీరోయిన్‌ను చూపించారు.
  • ఎడారిలో సైనికుల మధ్య జరిగే సన్నివేశాలను ట్యునీషియాలో తెరకెక్కించారు. వాటిని 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో తీశారు. ఆ సమయంలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 200మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. స్పీల్‌బర్గ్‌లాంటి ఒకరిద్దరు మాత్రమే ఆరోగ్యంగా ఉన్నారు. దానికి కారణం ఆయన డైట్‌. షూటింగ్‌ సమయంలో ఆయన మంచినీరు, స్పాగిటోస్‌ తిని మాత్రమే ఉన్నారట.
  • ఒక సన్నివేశంలో ఇండీ విమానాన్ని దొంగిలించి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న శత్రు సైనికులు దాన్ని అడ్డుకుంటారు. ఈ సీన్‌లో కనిపించే వ్యక్తి నిర్మాత ఫ్రాంక్‌ మార్షల్‌. స్టంట్‌మెన్‌లు చాలా మంది అనారోగ్యం పాలవడంతో ఆయన నటించాల్సి వచ్చింది. ఇదే సన్నివేశంలోనే హారిసన్‌ ఫోర్డ్‌ గాయపడ్డారు. ఆయన మోకాలి లిగమెంట్‌కు గాయమవడంతో ఐస్‌తో కొద్దిసేపు కాపడం పెట్టిన తర్వాత మళ్లీ షూట్‌లో పాల్గొన్నారు.

  • ‘టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌’లో పెద్ద పెద్ద గబ్బిలాలు కనిపిస్తాయి. అవి హానికరమైనవికావు. పండ్లను మాత్రమే తినే గబ్బిలాలు సినిమా కోసం పట్టుకొచ్చారు. ఇక ఇందులో కోతుల మెదడును తినే సీన్‌ ఉంది. అందుకోసం కోతుల ముఖం ఉన్న మౌల్డ్‌ను తయారు చేసి, అందులో రాస్‌బెరీ సాస్‌ను పోశారు.
  • ‘టెంపుల్‌ ఆఫ్‌ డూమ్‌’లో బాలీవుడ్‌ నటుడు అమ్రిష్‌పురి నటించారు. ఆయన నటించిన ఏకైక హాలీవుడ్‌ చిత్రమది. ఈ చిత్ర షూటింగ్‌ ఎక్కువ భాగం శ్రీలంకలో జరిగింది. అక్కడే బ్రిడ్జ్‌ సహా అనేక సెట్స్‌ వేశారు. నిజమైన ఇంజినీర్స్‌ ఆ బ్రిడ్జ్‌ను కట్టడం విశేషం. హీరో హారిసన్‌ ఫోర్డ్‌కు విపరీతమైన నడుం నొప్పి రావడంతో కొన్ని సన్నివేశాలను ఆయన డూప్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను పెట్టి తీశారు.
  • ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌లో ఒక కోతి నాజీ స్పైగా కనిపిస్తుంది. హీరోకు సంబంధించిన సమాచారాన్ని అది విలన్‌కు చేరవేస్తుంది. తన సుపీరియర్‌ ఆఫీసర్‌ కనిపించగానే ఆ కోతి సెల్యూట్‌ చేసేలా సీన్‌ అనుకున్నారు. కానీ, ఆ  కోతికి శిక్షణ ఇచ్చినా అది సరిగా చేయలేదు. దీంతో కెమెరాకు కనపడకుండా కోతి తలపై ద్రాక్షపళ్ల గుత్తిని ఉంచారు. వాటిని అందుకోవడానికి పైకి చేయి ఎత్తిన ప్రతిసారీ షాట్‌ తీసేవారు. అలా పర్‌ఫెక్ట్‌ షాట్‌ కోసం దాదాపు 50 టేక్స్ తీసుకోవాల్సి వచ్చిందట.

  • ‘రైడర్స్‌ ఆఫ్‌ ది లాస్ట్‌ ఆర్క్‌’ క్లైమాక్స్‌లో ముఖాలు కరిగిపోయే సీన్‌ కోసం ప్రత్యేక మాస్క్‌లు తయారు చేశారు. జిలిటెన్‌, ఊలు ఉపయోగించి వాటిని తయారు చేశారు. ఆ మాస్క్‌లకు రెండు వైపులా హీటర్స్‌, డ్రైయర్స్‌ పెట్టి 10 నిమిషాలు వేడి చేస్తే కానీ, అవి కరిగిపోయేవి కావట. కానీ, తెరపై కేవలం మూడు సెకన్లలో ముఖాలు కరిగిపోయినట్లు చూపించారు.
  • ‘ఇండియానా జోన్స్‌’ సిరీస్‌లో చివరి చిత్రంగా ‘డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ రాబోతోంది. జేమ్స్‌ మ్యాన్‌ గోల్డ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చరిత్రను తిరగరాయగలిగే శక్తి కలిగిన డయల్‌ కీ కోసం సాగే అన్వేషణలో ఈ సినిమా కథ సాగుతుందని చిత్ర ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఆ కీ దొరికిన తర్వాత చరిత్రలో హిట్లర్‌ చేసిన తప్పులను ఎలా సరిదిద్దారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

అన్నట్లు ఈ సినిమా చూసే ముందు గతంలో వచ్చిన నాలుగు సినిమాలను చూడాలనుకుంటున్నారా? అయితే, డిస్నీ+హాట్‌స్టార్‌లో అవి స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ వీకెండ్‌లో వాటిని చూసి ఆస్వాదించండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని