Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున

కొన్ని వందల చిత్రాల్లో నటించి తెలుగువారికి చేరువైన అలనాటి నటి జమున (Jamuna). 30 ఏళ్ల పాటు హీరోయిన్‌గా రాణించిన ఈమె నటిగా రాణిస్తోన్న తరుణంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొన్నారు. ఆయా విశేషాలను గతంలో పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. 

Updated : 27 Jan 2023 13:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ వంటి చిత్రాల్లో అక్కాచెల్లెళ్లుగా నటించి తెలుగువారి మనసు దోచుకున్నారు సావిత్రి (Savitri) - జమున (Jamuna). సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా ఉండేవారు. అయితే, వీళ్లిద్దరూ ఓ ఏడాది పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని గతంలో ఓసారి జమున స్వయంగా బయటపెట్టారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో తనకు ఎదురైన సంఘటనల గురించి ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. జమున కన్నుమూసిన నేపథ్యంలో.. ఆ విశేషాలను మరోసారి తెలుసుకుందాం.

జమునే సత్యభామ..!

‘‘సత్యభామ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. నేను వేసిన పాత్ర చూసి ఇటు నిర్మాతలు, అటు ప్రేక్షకులు ‘జమునే సత్యభామ’ అని భావించేవారు. రాజసం, వీరత్వం, అమాయకత్వం.. ఇలా అన్ని రసాలు కలిగిన పాత్ర అది. ఆ పాత్రలో నటించినందుకు ఆనందిస్తున్నా’’

సావిత్రీ నేనూ ఏడాది మాట్లాడుకోలేదు..!

‘‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ వంటి చిత్రాల కోసం మేమిద్దరం అక్కాచెల్లెళ్లుగా నటించాం. దానివల్ల మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో ఆమె నన్ను చెల్లి అని పిలుస్తుండేది. నా పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇంటికి వచ్చి నన్ను రెడీ చేసింది. మా ఇంట్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే, ఓ సమయంలో కొంతమంది వ్యక్తులు మా మధ్య తగువు పెట్టారు. దాంతో దాదాపు ఓ ఏడాదిపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. తర్వాత వివాదాలు సమసిపోయి మేమిద్దరం మళ్లీ కలిశాం. చివరిసారి చెన్నైలో ఆమె పరిస్థితి చూసి మనసు చలించిపోయింది’’

డబ్బు కోసం పేరు పాడుచేసుకోను..!

‘‘30 ఏళ్ల పాటు సినీ పరిశ్రమకు సేవలు అందించాను. అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నాను. అభిమానుల దృష్టిలో జమున అంటే ఓ గ్లామర్‌ క్వీన్‌, ఆత్మాభిమానం ఉన్న మనిషి. కాబట్టి డబ్బు కోసం చిన్న చిన్న పాత్రలు చేసి ఆ పేరును పాడుచేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే హీరోయిన్‌గా మానేశాక పూర్తిగా వెండితెరకు దూరంగా ఉన్నా’’

మరచిపోలేని సంఘటన..!

‘‘నా సినీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు సంఘటన చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు అగ్రనటులు నాపై నాలుగేళ్లపాటు బహిష్కరణ (1959-63) విధించారు. నా అలవాట్లు వాళ్లకు నచ్చకపోవడం వల్లే నన్ను నిషేధించి ఉండొచ్చు. ‘పొగరుబోతు’, ‘టైమ్‌కి రాదు’, ‘కాలం విలువ తెలియదు’.. ఇవీ వాళ్లు చెప్పిన కారణాలు. విషయం తెలుసుకున్న పలువురు సినీ పెద్దలు రాజీ కుదిర్చి.. మేము మళ్లీ సినిమాల్లో కలిసి నటించేలా చేశారు’’

లేఖ రాసి ఇవ్వమంటే నో చెప్పా..!

‘‘గుండమ్మ కథ’ నా కెరీర్‌లో ఓ అపురూప చిత్రం. ఆ సినిమాకు ముందు నాలుగేళ్లపాటు ఎన్టీఆర్‌ - ఏఎన్నార్‌లతో నేను మాట్లాడలేదు. మా మధ్య సయోధ్య కుదర్చడం కోసం కె.వి.రెడ్డిగారు, చక్రపాణి, నాగిరెడ్డి ప్రయత్నం చేశారు. ‘లేటుగా రాను. షూటింగ్‌కి ఒక అరగంట ముందే వస్తాను’ అని నన్ను లేఖ రాయమన్నారు. నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. దాంతో వాళ్ల ప్రయత్నం విఫలమైంది. తర్వాత నేనే సమయానికి సెట్‌కు వస్తానని చెప్పా’’

ఆ వివాదంలో నిజం లేదు..!

‘‘ఎన్టీఆర్‌ శ్రీకృష్ణ పరమాత్ముడిగా కనిపిస్తే ఆంధ్ర ప్రేక్షకులకి ఎంత అభిమానమో.. ఆయన పక్కన సత్యభామగా జమునే అని పేరు తెచ్చుకొనే అదృష్టం నాకు కలిగించారు. ‘శ్రీ కృష్ణ తులాభారం’లో ఆయన్ని నేను తలపై తన్నానని అప్పట్లో కొంతమంది వివాదం సృష్టించారు. నిజం చెప్పాలంటే అలాంటిదేమీ జరగలేదు. ఆ సినిమాలోని ఓ సన్నివేశం షూట్‌ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయనకు నా కాలు తగిలింది. వెంటనే నేను క్షమాపణలు చెప్పాను. ఆయన నిజంగా దేవుడు’’

ఎన్నో చర్చలు జరిగాయి..!

‘‘మూగ మనసులు’ చిత్రం ఒక స్వర్ణయుగం. ఆ పాత్ర మరపురాని అనుభూతులు అందించింది. అప్పట్లో ఆ పాత్ర గురించి ఇండస్ట్రీలో ఎన్నో చర్చలు జరిగాయి. ఈ పాత్రను నేను వేస్తానంటే నేను వేస్తానంటూ ఎంతోమంది నటీమణులు వచ్చారు. కానీ అలనాటి మహా దర్శకులు సుబ్బారావు, నాగేశ్వరరావుగారు.. వాళ్లందరికీ ఆ పాత్రకి జమునే ఉండాలని చెప్పారు. ఆ రోజుల్లో ఒక ప్రచారం జరిగింది. ‘మూగ మనసులు’ల్లో జమునని బుక్‌ చేస్తే ఆ పల్లెటూరి యాస ఆమె మాట్లాడుతుందా? లేదా? అనే సందేహం. కానీ వాటిని పక్కనపెట్టి నన్ను సినిమాలోకి తీసుకోవడం నాకొక సవాల్‌గా అనిపించింది’’ అని జమున వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని