Shankar: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పంథాలోనే ‘ఇండియన్‌’.. శంకర్‌ ప్లానింగ్‌ అదేనా?

హీరో కమల్‌ హాసన్‌- దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన చిత్రం ‘ఇండియన్‌’. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతోంది.

Published : 26 Jul 2023 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా దర్శకుడు శంకర్‌ (Shankar) ‘ఇండియన్‌ 2’ (Indian 2) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఇండియన్‌’కి కొనసాగింపుగా రూపొందుతోంది. పార్ట్‌ 3 (Indian 3) కూడా రానుందని నటుడు, ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్‌ కొన్ని రోజుల క్రితం హింట్‌ ఇచ్చారు. కానీ, దానిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు, ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. పార్ట్‌ 2, పార్ట్‌ 3లను శంకర్‌ ఒకేసారి చిత్రీకరిస్తున్నారని, రెండో భాగం దాదాపు పూర్తవగా.. మూడో భాగం 75 శాతం పూర్తయిందని వార్తలొస్తున్నాయి. మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా పంథాలో ఒకేసారి రెండు భాగాల చిత్రీకరణ పూర్తిచేసి, నెలల వ్యవధిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కథ డిమాండ్‌ మేరకే రెండు భాగాలు తెరకెక్కిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. రెండు భాగాల షూటింగ్‌ ఒకేసారి చేయడం వల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుందని చిత్ర బృందం భావించినట్టు సమాచారం.

బాలకృష్ణను అలా చూసి అభిమానులు షాకైపోయారు!

‘ఇండియన్‌’ (భారతీయుడు)లో కమల్‌ హాసన్‌ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. వాటిల్లోని సేనాపతి పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఇండియన్‌ 2’లోనూ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. కొవిడ్‌కు ముందే ప్రారంభమైన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడి, పునః ప్రారంభంలో శరవేగంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రం కోసం శంకర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని ఉపయోగించి, వివేక్‌, నెడముడి వేణు పాత్రలను రీక్రియేట్‌ చేయబోతున్నారు. కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు, రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)ని తెరకెక్కిస్తున్నారు శంకర్‌.

సేనాపతి లుక్‌ వెనుక హీరో ఈయనే..

సేనాపతి గెటప్‌ కోసం కమల్‌కు కొన్ని గంటలపాటు మేకప్‌ వేసేవారట. ఆ వృద్ధుడి పాత్ర అంత అద్భుతంగా రావడం వెనుకు ఉన్న హీరో మరెవరో కాదు మైఖేల్‌ వెస్ట్‌మోర్‌ (Michael Westmore). ‘మాస్క్‌’, ‘ది ఇయర్‌ వి మేక్‌ కాంటాక్ట్‌’వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన ఆయన ‘ఇండియన్‌’తోపాటు కమల్‌ నటించిన ‘దశావతారం’ సినిమాకి పనిచేశారు. ‘ఇండియన్ 2’లోని కమల్ పాత్రకు ఆయనే మేకప్‌ ఆర్టిస్ట్‌. మైఖేల్‌ను కమల్‌ తాజాగా కలుసుకున్నారు. సంబంధిత ఫొటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని